సరసమైన,ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో లేకపోవడం దేశమంతటా విస్తృతంగా ఉంది. దేశ జనాభాలో 60 శాతం పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు, వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు కీలకం. అయితే వ్యవసాయ రంగం పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ అస్థిరత కారణంగా ఉత్పాదకత తగ్గడం , దేశ సహజ వనరులు,పెరుగుతున్న జనాభా కారణంగా అందుబాటులో ఉన్న వ్యవసాయ భూములు పాక్షికంగా తగ్గాయి.
మనదేశం ప్రతి సంవత్సరం దాదాపు 100 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. దేశ జనాభాకు తగినంత ఆహారం ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల కారణంగా అనేక కుటుంబాలు, ముఖ్యంగా పిల్లలకు ఆహారం అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా భూతాపం ఊహించని దానికంటే అధికమవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రతియేటా 560 ఘోర విపత్తులు సంభవిస్తాయని ఐక్యరాజ్యసమితి ఇటీవల నివేదిక విడుదల చేసింది.
తాజాగా అమర్‌నాథ్ ఈ క్షేత్రంలో అకస్మాత్తుగా సంభవించిన ఆకస్మిక వరదల్లో చాలామంది చనిపోయారు, గల్లంతయ్యారు. ఇలాంటి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను హరిస్తున్నాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాతావరణ సంబంధిత ముప్పులు సంభవిస్తున్నాయి. వాటి తీవ్రత కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటోందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది.వాతావరణ మార్పులు వ్యవసాయపంటలపై అధికంగా ప్రభావం చూపుతాయని ఇప్పటికే పర్యావరణ నిపుణులు వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి
ఆరుగాలం శ్రమిస్త్తూ కష్టాలే పెట్టుబడిగా, నష్టాలే దిగుబడులుగా కోట్లాది రైతులున్న వ్యవసాయ ప్రధాన దేశం ఇది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఘనతర లక్ష్యం కొన్నేళ్లుగా శుష్క నినాదంగా ఉంటోంది. వ్యవసాయం చేసే రైతులు కాడి, మేడి వదిలేసి వేరే బతుకుతెరువును వెతుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ గణాంకాలే ఈ వాస్తవాన్ని వెల్లడి చేస్తున్నాయి.
నేటికీ 54 శాతం జనావళికి వ్యవసాయమే ముఖ్య జీవనాధారం. సగానికి పైగా సేద్య కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ( జాతీయ నమూనా సర్వే కార్యాలయం) లెక్క చెపుతున్నది. పల్లెపట్టులో చెల్లాచెదురై రైతులు, వ్యవసాయ కూలీల కొనుగోలు శక్తి పెంచే ఉద్దీపన చర్యలు ఉంటేనే దేశం ఆర్థికంగా కుదుటపడుతుంది. బడ్జెట్లో వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాబడిని మించి పోతున్న పెట్టుబడి
తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ఆహార పంట వరిసాగుపై ప్రతి ఎకరాకు పెట్టుబడిలోనే ఆరు వేల రూపాయల దాకా నష్టపోతూ ఉంటే ఏం తినాలి, ఏం బతకాలి? పత్తి, సోయాచిక్కుడు, పొద్దుతిరుగుడు వంటి పంటల ఉత్పత్తి వ్యయానికి, రైతుకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో మారుతున్న కాలానికి తగ్గట్టుగా పంటల సాగులో కొత్త పోకడలు అందిపుచ్చుకోవడం తప్పనిసరి. వ్యవసాయం నుంచి వైదొలుగుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ స్వయంపోషణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదపడ్డాయని చెప్పవచ్చు. కానీ నేడు గ్రామీణ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమై కులవృత్తులు, కుటీర పరిశ్రమలు కుంటుబడి ఇతర వృత్తులకు మళ్లుతున్నారు. ప్రభుత్వాలు చేపడుతున్న తూతూ మంత్రం కార్యక్రమాలు వ్యవసాయ సమాజాన్ని సరైన దిశలో నడిపించే లేక పోతున్నాయి.
దాదాపు 60 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా, నేటికీ వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్న దేశంలో ఇప్పటికే పట్టణాల ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఆవిరైపోయాయి. నిరుద్యోగం 45 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిపోయింది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే వ్యవసాయాన్ని అమలు చేసినప్పుడు ఈ రంగంలో ప్రతి ఏటా 12 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.
రైతులను పట్టణాలకు తరిమి వారిని రోజువారీకూలీలుగా మార్చుతున్న విధానాలకు బదులుగా ఆకర్షణీయమైన వ్యవసాయ నమూనాను అమలు చేయడం గురించి మన విధాన నిర్ణేతలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరిత విప్లవం ప్రారంభమైన 50 ఏళ్ల తర్వాత 2016 ఆర్థిక సర్వే చేదు వాస్తవాన్ని ముందుకు తీసుకు వచ్చింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం సంవత్సరానికి రూ. 20 వేలు మాత్రమే ఉంటోంది.
అంటే నెలకు రైతు సగటు ఆదాయం రూ. 1700 మాత్రమే. ఏడాదికేడాది రైతు కుటుంబాలు ఇంత తక్కువ ఆదాయంలో ఎలా మనుగడ సాధిస్తాయన్నది నివ్వెరపరిచే విషయం.
వ్యవసాయాన్ని ఇష్టపడని యువత
పండించే వారే లేకపోతే పాలించే వారికి తిండి పుట్టదు. గిట్టుబాటు కాని సేద్యంపై విరక్తి చెందుతున్న రైతుల విషాద గాథలు అలాగే కొనసాగితే దేశ ఆహార భద్రత భరోసా ఉండదు. సుమారు 150 కోట్ల జనాభాకు ఆవాసమైన భారతావని విస్తీర్ణ పరంగా రష్యా, అమెరికా, కెనడా తదితర దేశాల కంటే చాలా చిన్నది. హరిత విప్లవం తో పంట దిగుబడులను గణనీయంగా పెంచుకోవాల్సిన దిశగా పయనించాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది.
పంటల బీమా నుంచి గోదాముల వరకు ఎక్కడికక్కడ మేట వేసిన సమస్యలతో అన్నదాతల గుండెలు అలిసిపోతున్నాయి. అన్ని గండాలను దాటుకొని పంటను మార్కెట్‌కు తీసుకువస్తే మద్దతు ధరలు ఎండమావులవుతూ సర్కార్ ప్రకటనలోని
డొల్లతనాన్ని కళ్లకు కడుతున్నాయి. 30 వేల మంది గ్రామీణ యువతను ఐదేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే చేస్తే కాడి పట్టి రైతులుగా స్థిరపడతామన్న వారి శాతం 1.2 మాత్రమే. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయం ఒక వృత్తిగా కొనసాగాలంటే,నవతరం దాన్ని ఆనందంగా స్వీకరించాలంటే సమగ్ర జాతీయ వ్యవసాయ విధానం ద్వారా ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాకాక ప్రభుత్వాలు తాత్కాలిక తాయిలాలకు పరిమితమైతే ఆహార భద్రత పరంగా జనభారతం భవిష్యత్తు పెను ప్రమాదంలో పడుతుందని సర్వే వెల్లడిస్తోంది. కేవలం ఆయిల్‌పామ్ ద్వారా ఇండోనేషియా,మలేషియాలు భారత్ నుంచి ఏటా 50 వేల కోట్ల ఆదాయం పొందుతున్నాయి. చిన్నదేశమైన న్యూజిలాండ్ రైతులు ప్రపంచ పాల ఉత్పత్తుల విపణిని శాసిస్తున్నారు.ఆయా దేశాల రైతులు సాగు చేస్తున్న ఈ తరహా వాణిజ్యాన్ని భారతీయ రైతాంగం అందిపుచ్చుకోవాలి.
అందుకోసం ఊరూరా ఆహారశుద్ధి పరిశ్రమలు రావాలి. పంటలకు గిట్టుబాటు ధరకు కొని శుద్ధిచేసి అమ్మడానికి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉండటం ఆహ్వానించదగ్గ విషయం. ఇది సాకారం కావాలంటే రాజకీయ చిత్తశుద్ధి, పటిష్టమైన కార్యాచరణ, గుణాత్మకమైన రాజకీయ పరిపాలన వ్యవస్థ ఉండాలి.
- డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి