19-04-2025 12:00:00 AM
ప్రయాణం వ్యక్తిగత అభివృద్ధికి, విజ్ఞాన విస్తరణకు, ప్రపంచాన్ని కొత్త కోణంలో అన్వేషించేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. దీనివల్ల కొత్త అనుభవాలు పరిచయమవుతాయి. భిన్నమైన జీవన విధానాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. చారిత్రక ప్రదేశాలు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు వంటివాటిని సందర్శించడం ద్వారా పుస్తకాలలో చదివిన విషయాలను నిజ జీవితంలోకి అన్వయించుకో గలుగుతాం. పర్యటనలు, యాత్రలు ఊరికే టైమ్‌పాస్‌కు కాకుండా మరింత కొత్త సమాచార సేకరణకు, విజ్ఞాన సముపార్జనకు బాటలు వేసేలా ఉండాలి.
ఆయా ప్రాంతాల ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలను తెలుసుకోగలుగుతాం. విద్యార్జన సమయంలో జరిగే ఎక్స్‌కర్షన్స్ వారికి ఎంతగానో ఉపయుక్తం. ప్రభుత్వాలు, అధికారులు ఇలాంటి ప్రయాణాలకు కావలసిన ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలి. తరగతి గదులకు పరిమితమైన విద్య ప్రాక్టికల్ జ్ఞానాన్ని ఇవ్వలేదు. విద్యార్థులు వివిధ రంగాల నిపుణులతో ప్రత్యక్షంగా సంభాషించే అవకాశమూ ఏర్పడుతుంది.
టీచర్లు, తల్లిదండ్రులు కూడా ప్రతి ఏడూ ఏ స్థాయి పిల్లలను ఆ స్థాయిలో విహార, విజ్ఞానయాత్రలకు తీసుకెళ్లడానికి ఉత్సాహం చూపాలి. దీనిద్వారా వారిలో పరిశీలనా దృష్టి పెరుగుతుంది. నేర్చుకున్న విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారు. నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేందుకు యాత్రలు చక్కగా సహాయ పడతాయి. బాల్యంలో, ఇంకా యుక్తవయసులో జరిగే ఈతరహా విద్యా సందర్శన అనుభవాలు ప్రతి ఒక్కరికీ జీవితాంతం గుర్తుండి పోతాయి.
- డా. వేపకొమ్మ కృష్ణకుమార్, హైదరాబాద్
ప్రాణాంతక వేగాలకు కళ్లెం వేద్దాం
వాహనాలు నడిపే వేళ మనలను మనలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి యువతకు అమిత వేగం ఆనందాన్ని ఇవ్వవచ్చునేమో కానీ, కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదని తెలుసుకోవాలి. ఒక్కోసారి ప్రమాదాలకు దారితీసి ప్రాణాలమీదికి రావచ్చు. ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా యువకులు బైక్‌లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ, అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ‘అతివేగం అనర్థదాయకం’, ‘నడుపుము మీ వాహనం నెమ్మదిగా’ వంటి బోర్డులను రాష్ట్ర రవాణా శాఖవారు ఎన్ని పెట్టిన వాటిని పెడచెవిన పెడుతుండడం బాధాకరం.
మోటార్ బైక్‌లను యమస్పీడుతో దౌడు తీయించడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. బైక్‌పై ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురూ ప్రయాణిస్తూ, తమ ఇష్టం వచ్చిన రీతిలో కటింగులు కొడుతుంటారు. వీరిముందు వేరే సర్కస్ ఫీట్లు పనిచేయవనే చెప్పాలి. పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టి వారి వేగానికి చెక్ పెట్టేలా చూడాలి. అలాంటి వారినుంచి జరిమానాలు వసూలు చేస్తూ, క్రమశిక్షణ చర్యలు ఎన్ని తీసుకుంటున్న పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు.
-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా