విభజన సమస్యలపై ముఖాముఖి భేటీ
- ఏపీ సీఎంకు తెలంగాణ సీఎం ప్రత్యుత్తరం
- 6న జ్యోతిబాపూలే భవన్‌లో సీఎంల భేటీ
- ఎజెండా సిద్ధంచేయాలని అధికారులకు రేవంత్ ఆదేశం
- ఏపీ సీఎంతో భేటీకి ముందే మంత్రివర్గంతో చర్చలు!
- 9, 10 షెడ్యూల్‌లోని అంశాలపై సీఎంల చర్చ
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అపరిష్కృత అంశాలపై చర్చించేందుకు మహాత్మా జ్యోతిబాపూలే భవన్‌లో సమావేశం నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రెండు రాష్ట్రాల మధ్య పదేండ్లుగా పరిష్కారం కాని అంశాలపై చర్చించేందుకు సమావేశమవుదామని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. ఆ లేఖకు రేవంత్‌రెడ్డి మంగళవారం బదులిచ్చారు. సమావేశానికి రావాల్సిందిగా ఏపీ సీఎంను ఆహ్వానించారు. సమావేశానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను సిద్ధం చేయాలని సూచించారు.
మంత్రులతో సమాలోచనలు
ఏపీ సీఎంతో సమావేశానికి ముందే తెలంగాణ సీఎం తన మంత్రివర్గ సహచరులతో సమావేశం కానున్నట్టు తెలి సింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆస్తులు, ఇతర అంశాలపై మంత్రులతో లోతుగా చర్చించి, వాటిని క్రోడీకరించి ఏపీ సీఎం ముందు ఉంచాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. విభజన సమస్యలు ఇప్పటికీ తెలంగాణలో భావోద్వేగ అంశాలుగానే ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ వంటి ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాష్ట్రానికి న్యాయబద్ధంగా సాధించుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
నిజానికి హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్‌సభ ఎన్నికలకు ముందే చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై గతంలోనే క్యాబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపర్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల ఫోలింగ్ ముగిసేవరకు ఈ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టింది. ఏపీలో ప్రభు త్వం మారటంతో కొత్త సీఎం చంద్రబాబు విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి తెలంగాణ సీఎంకు లేఖ రాశారు.
జఠిల సమస్యలే
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లయినా ప్రధా న సమస్యలైన నీళ్లు, నిధులు, ఆస్తుల పంపకాల వివాదాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నా యి. చట్టంలోని ౯వ షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీ సీ, రాష్ట్ర ఆర్థిక సంఘం తదితర 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభి ప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్‌లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు యూ నివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవల పై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.
రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షే మ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైనా వివాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా నదీ జలాల్లో వాటాల అంశం కూడా అలాగే ఉన్నది. వీటన్నింటిపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలుసార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ముఖాముఖి చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. సీఎం ల సమావేశంలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చని ఆశిస్తున్నారు.
చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి లేఖ
ముఖాముఖి సమావేశం కోసం ఏపీ సీఎం రాసిన లేఖకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జవాబు రాశారు. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించినం దుకు అభినందనలు. మీరు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన నాయకుల జాబితాలో చేరారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి సమావేశం కావాల న్న మీ ఆలోచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. విభజన సమస్యల పరిష్కారం అత్యవసరం. పరస్పర సహకారం, ఆలోచన లు పంచుకోవడం చాలా ముఖ్యం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి మాకు ముఖాముఖి సమావేశం అవసరం. తెలంగా ణ ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపు న, జూలై 6న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే భవన్‌లో జరిగే సమావేశానికి మిమ్ములను ఆహ్వానిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.