* కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్
* సిరిసిల్ల జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరుకు కృషి
* కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొవాలి
* ప్రసాద్ పథకం కింద వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు
సిరిసిల్ల , జనవరి 11 (విజయక్రాంతి); ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాల కతీతంగా నాయకులంతా కలిసి పని చేయాలని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని, దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యతని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69 లక్షల 54 వేలు విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
గతంలో వేములవాడ కేంద్రంగా రూ.2 కోట్ల 50 లక్షల విలువ చేసే పరికరాలను 1930 మంది దివ్యాంగ సోదరి సోదరీమణులకు అందించామ న్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయాల కతీతంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పని చేస్తున్నామనన్నారు.
ప్రసాద్ స్కీం కింద వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఎదురు మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి కల్పన కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి రూ.18 వేల వరకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లాలో గొప్ప స్థాయికి ఎదగడం తన వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందన్నారు. సిరిసిల్ల జిల్లాలో రూ.9 వేలకు పైగా దివ్యాంగులకు ఫించన్ పంపిణీ చేస్తున్నామన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చోరువతో దివ్యాంగులకు ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారన్నారు.
జిల్లాలో 322 మంది దివ్యాంగులకు 674 ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో మరోసారి క్యాంప్ నిర్వహించే పెండింగ్ ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని, అదేవిధంగా కొంతమంది దివ్యాంగులకు ప్రత్యేకంగా జైపూర్ నుంచి కాలు తయారుచేసి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలతో చర్చించి వేములవాడ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను సీ.ఎస్.ఆర్ కింద అభివృద్ధి చేయాలన్నారు. పిల్లలకు ఐఐటి, నీట్ శిక్షణ ఇట్టి ఇచ్చేందుకు సహకారం అందజేయాలని, సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ.. అలింకో ద్వారా ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు క్యాంపు నిర్వహించి 675 మంది దివ్యాంగులను ఎంపిక చేసి 65 లక్షల పైగా విలువగల ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
- మాన కొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండి కలెక్టర్ ఆధ్వర్యంలో , ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు, బ్యాటరీ సైకిళ్ళు వంటి ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. అంగవైకల్యంతో పుట్టిన ప్రజల అభ్యున్నతికి మనమంతా పనిచేయాలన్నారు.
దివ్యాంగుల తో నడిపే పెట్రోల్ బంక్ నేడు చాలా బాగా జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిరిగానే కరీంనగర్ జిల్లాలో కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దివ్యాంగులకు నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
అనంతరం కేంద్ర మంత్రివర్యులను, ప్రభుత్వ విప్ లను జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమం అధ్యక్షులు రాము, సిరిసిల్ల మున్సిపల్ చైపర్సన్ కళా చక్రపాణి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మి రాజం, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు