04-03-2025 01:51:49 AM
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా నదీపరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యా రు. కృష్ణా, గోదావరి నదీజలాలకు సం బంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశా రు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయా వివరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలియ జేశారు.
కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటి కేటాయింపులు చేసిందని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. ఏళ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందన్నారు.
ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణా నది నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలీమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరి స్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు.
పాలమూరు-- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ సమర్పించినా అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు.
సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీల కు మాత్రం అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా మండలి (టీఏసీ) నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
అనుమతులు లేకుండానే బనకచర్లకు రూపకల్పన
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి--బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జలసంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కేఆర్‌ఎంబీల నుంచి ఎటువంటి అనుమతి పొందలేదన్నారు.
గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు అనుమతు లు ఇవ్వలేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు.
అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తాము నష్టపోతామని, కృష్ణా డెల్టా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌనిల్స్‌లోనూ ఏపీ గోదావరి--బనకచర్ల ప్రాజెక్టు ఎటువంటి చర్చ జరగలేదని కేంద్రమంత్రికి సీఎం వివరించారు.
పాలమూరు- -రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, మోడికుంట వాగు, చనా ఖా కొరటా బ్యారేజీ (డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ).. పీఎంఆర్‌పీ 2024 కింద తగిన ఆర్థిక సాయం అందజేయాలని జల్‌శక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
సాగు నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహా యం అందజేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధి కింద 50 సంవత్సరాలు పాటు వడ్డీలేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రాణహిత--చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని, ముంపునకు సంబంధించి మహారాష్ర్ట ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలని కోరారు.
సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ర్ట నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, రాష్ర్ట నీటి పారుదల శాఖ ఈఎన్సీ విజయ్ భాస్కర్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.