06-04-2025 12:00:00 AM
అలసట పెద్ద వయసు ఉన్నవారిలో సర్వసాధారణంగా కనిపించే లక్షణం. అయితే ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నపని చేసినా వెంటనే అలసిపోవడం యువతలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలేంటో చూద్దాం..
ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, సరైన సమయానికి పోషకాలతో కూడిన భోజనం చేయకపోవడం.
సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం, మొబైల్, ల్యాప్‌టాప్‌లను నిద్రముందు ఎక్కువగా వాడటం, ఆఫీసులో గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చోవడం వల్ల బద్ధకం పెరిగిపోతుంది. శారీరక వ్యాయామం తగ్గడం వల్ల మనలో శక్తి తగ్గి కొంచెం పనిచేసినా, కాస్త ఎక్కువ దూరం నడిచినా అలసిపోతున్నాం.
చదువుల్లో, ఉద్యోగాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి మనల్ని మానసిక, శారీరక అలసటకు గురిచేస్తుంది.
ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం వల్ల ఎండ తగలక విటమిన్ డి లోపం, స్వచ్ఛమైన గాలి లభించకపోవడం, ఐరన్ లోపం వల్ల మనలో అలసట పెరిగిపోతుంది.
అందుకే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ మొబైల్ వాడకాన్ని తగ్గించి శారీరక వ్యాయామంపై దృష్టి పెడితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఇలా చేద్దాం..
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇది మనలో బద్ధకాన్ని తగ్గించి.. త్వరగా అలసిపోకుండా చేస్తుంది.
సమయానికి భోజనం చేయాలి. అలాగే జంక్ ఫుడ్ తీసుకోకుండా మంచి పోషకాలతో కూడిన ఆహారం తినాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
మన శరీరంలో నీటి శాతం తగ్గినా మనకు అలసటగా అనిపిస్తుంది. అందుకే రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. వేసవిలో ఇంకా ఎక్కువ తీసుకోవాలి.
ఎక్కువ బరువు ఉన్నవారు వేగంగా అలసిపోతారు. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలి. దీని కోసం సరైన ఆహారం తీసుకోవడంతో పాటు శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
సరైన నిద్రలేకపోయినా నీరసంగా, అలసటగా ఉంటుంది. ఎక్కువ రోజులపాటు ఇలా కొనసాగడం మంచిదికాదు. అందుకే ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి.
షుగర్, రక్తహీనత, థైరాయిడ్, గుండెజబ్బులు కూడా అలసటకు కారణమవుతుంతటాయి. అందుకే తరచూ అలసటగా ఉంటే ఒకసారి డాక్టరు సలహాతో టెస్టులు చేయించుకోవడం మంచిది.