మన దేశంలో క్షయవ్యాధి నివారణకు, నిర్మూలనలకు అందరూ కట్టుబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రభుత్వ అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’తోపాటు ‘నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్’, ‘మల్టీ-డ్రగ్ -రెసిస్టెన్ట్ టీబీ’ (ఎండీఆర్-టీబీ) కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా కేసులు కొంతవరకు తగ్గుముఖం పడుతున్నాయి. పెద్ద ఎత్తున చికిత్స అందుబాటులోకి వచ్చింది కూడా. ఒక అంచనా ప్రకారం దేశంలో 2010లో టీబీ కారణ మరణాలు 5.8 లక్షలు ఉండగా, 2023లో 3.2 లక్షలకు తగ్గాయి.
ప్రపంచ స్థాయిలో హెచ్‌ఐవీ సోకిన లేదా సోకని వారితో కలిపి 26 శాతం దేశంలో టీబీ కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. ఒకవైపు టీబీ చికిత్సలు పెరుగుతున్నప్పటికినీ మరోవైపు ప్రజలలో పోషకాహార లోపం, మధుమేహం, పొగాకు ఉత్పత్తుల వాడకం వంటివి పెరగడం వల్ల టీబీ కారణ మరణాలు సంభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస-) ఆధ్వర్యంలో విడుదలైన ‘గ్లోబల్ టీబీ రిపోర్ట్- ఇటీవల వెల్లడించింది. కోవిడ్ తర్వాత టీబీ నివారణకు ప్రభుత్వ కేటాయింపులు తగ్గిన మాట వాస్తవమే. కాని, గత 2022తో పోల్చితే 2023లో 38 శాతం అధిక నిధులు (రూ.3,400 కోట్లు) కేటాయించినట్లు తెలుస్తున్నది.
టీబీ ఒక ప్రమాదకర, ప్రాణాంతక అంటువ్యాధి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం, వారికి సరైన చికిత్స అందించడం తప్పనిసరి. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా టీబీ నివారణ అసాధ్యమేమీ కాదని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రధానంగా ఊపిరితిత్తులకు ‘మైకోబ్యాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్ బ్యాక్టీరియా’వల్ల ఈ భయంకర అంటువ్యాధి సంక్రమిస్తుంది. సోకిన రోగులు దగ్గడం, తుమ్మడం, మాట్లాడడం, నవ్వడం లాంటివి చేసినపుడు సమీప వ్యక్తులకు సోకుతుంది.
చికిత్సలో భాగంగా 4- రకాల యాంటీ బ్యాక్టీరియల్ ఔషధాల కలయికతో దీనిని నయం చేస్తారు.
గత అక్టోబర్ 29న ఐరాస -‘గ్లోబల్ టీబీ రిపోర్ట్- జెనీవా విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం, టీబీ వ్యాధి భారత్‌లో క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమైనా, ప్రపంచ దేశాల స్థాయిలో పోలిస్తే కేసులు ఇంకా అత్యధికంగానే నమోదవుతున్నాయి. సుమారు 26 శాతం వరకు భారతదేశంలోనే ఉన్నాయని, 55.9 శాతం ప్రపంచ టీబీ కేసులు కేవలం ఐదు దేశాల్లో నమోదవుతున్నాయని పై నివేదిక స్పష్టం చేసింది. ఇంకా, ఇండోనేషియాలో 10 శాతం, చైనాలో 6.8 శాతం, ఫిలిప్పీన్స్‌లో 6.8 శాతం, పాకిస్థాన్‌లో 6.3 శాతం టీబీ కేసులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
2024లో 193 దేశాలకు చెందిన టీబీ కేసుల వివరాలు ఈ నివేదికలో చోటు చేసుకున్నాయి.
డా.బుర్ర మధుసూదన్ రెడ్డి