ప్రస్తుతం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అందులో థైరాయిడ్ సమస్య ఒకటి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. అయితే థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. వచ్చినా ఎలా నివారించాలో తెలియడం లేదు. అసలు థైరాయిడ్ కథేంటీ?
దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం..
మన శరీరంలో ఎన్నో అవయవాలు, విభాగాలుంటాయి. వీటిలో థైరాయిడ్ వ్యవస్థ కీలకంగా పని చేస్తుంది. మన జీవక్రియల్ని క్రమబద్ధం చేసే అతి ముఖ్యమైన పనిని ఈ వ్యవస్థే నిర్వహిస్తుంది. సీతకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి.. శరీర అవసరం మేరకు నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ జీవక్రియల్ని సక్రమంగా జరిగేలా చూస్తుంది.
అయితే ఈ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా, తక్కువైనా కూడా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్యలను రెండు రకాలుగా విభజించారు. అవసరమైన దాని కంటే..
థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితిని హైపర్ థైరాయిడిజమని, సాధారణ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్ హార్మోన్ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని పిలుస్తారు. వీటిపై అవగాహన ఉండాలంటే ముందుగా థైరాయిడ్ లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో..
థైరాయిడ్ వల్ల చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా థైరాయిడ్ గ్రంథి దెబ్బతినడం వల్ల జుట్టు పెరగడం కూడా చాలా వరకు ఆగిపోతుంది. ఈ సమయంలో హెయిర్ పాల్, డ్రై హెయిర్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా నిరాశ, మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
వీటిలో ఏ ఒక్కటి ఇబ్బంది పెట్టినా వెంటనే మెరుగైన చికిత్స తీసుకోవడం మంచిది. అయితే ప్రెగ్రెన్నీలో థైరాయిడ్ తీవ్రత తగ్గాలంటే అయోడిన్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అయోడిన్ తక్కువగా ఉన్న ఆహారం సమస్యను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
ఆస్పత్రికి వెళ్లినప్పుడు కూడా ఎక్కువ కారం, ఉప్పును తినకూడదని డాక్టర్లు చెప్పడం వినే ఉంటారు. అలాగే థైరాయిడ్ ఉన్న గర్భిణులు గ్రీన్ వెజిటేబుల్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సొరకాయను ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
కనీస జాగ్రత్తలు
థైరాయిడ్ ఏ వయసు వారిలోనైనా తలెత్తవచ్చు. ముఖ్యంగా హైపో థైరాయిడిజం జీవితాంతం కొనసాగవచ్చు. కాబట్టి వైద్యుల సలహాతో మందులు వాడాలి. హైపర్ ఉన్నవాళ్లు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ తగ్గిందని నిర్ధ్ధారించుకునేందుకు కచ్చితంగా మళ్లీ పరీక్ష
చేయించుకోవాలి. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథి వాస్తుంది. అది కొన్నిసార్లు క్యాన్సర్స్‌గా మారే ప్రమాదం ఉంది. అలాంటి తేడా కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
థైరాయిడ్ హార్మోన్ పనితీరు సక్రమంగా ఉండాలంటే జింక్, రాగి లాంటి ఖనిజాల పాత్ర కూడా కీలకమే. అందుకే జింక్ ఎక్కువగా లభించే ఓట్స్, చేపలు, నట్స్ లాంటివి ఎంచుకోవాలి.
అలాగే కొన్ని పదార్థాలు థైరాయిడ్ హార్మోన్స్ ప్రభావం చూపుతాయి. అందుకే సమస్యను నిర్ధరించాక వైద్యుని సలహాతో అలాంటి వాటిని తగ్గించాలి.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగవుతుంది. రోజూ కాసేపు నడవడం, డ్యాన్స్ చేయడం, ఏదైనా ఆట ఆడటం, యోగా చేయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఒత్తిడి కూడా థైరాయిడ్ హార్మోన్స్ ప్రభావం చూపుతుంది. కాబట్టి దాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించాలి. ప్రాణాయామం లాంటివి సాధన చేస్తే ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉంటాయి. చక్కటి ఆరోగ్యం సొంతమవుతుంది.
లక్షణాలు ఇవే..
థైరాయిడ్‌తో బాధపడేవారిలో తీవ్రమైన అలసట ఉంటుంది.
అలాగే వేగంగా బరువు పెరుగుతారు.
థైరాయిడ్ హార్మోన్స్ పెరిగితే ఒక్కసారిగా శరీర బరువు తగ్గుతుంది. దీన్ని హైపర్ థైరాయిడిజమని అంటారు.
జుట్టు రాలిపోతుంది.
అధికంగా చెమట పడుతుంది.
ఈ వ్యాధికి సంబంధించి బయటకు కనిపించే లక్షణాలలో మెడ ఉబ్బడం ఒకటి. థైరాయిడ్ గ్రంథి మార్పుల వల్ల ఈ లక్షణం కనిపిస్తుంది.
థైరాయిడ్ సమస్య తలెత్తినప్పుడు శరీర ఉష్ణోగ్రతలో మార్పు కనిపిస్తుంది. ఒక్కసారిగా పెరగడమో, తగ్గడమో కనిపిస్తుంది. ఎక్కువ చలిగానో లేదా ఎక్కువ వేడిగానో అనిపిస్తుంది.
చర్మం పొడిబారుతుంది.
గోర్లు పెలుసుగా మారతాయి.
కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి.
చేతులు జలదరింపులకు గురవుతాయి.
మలబద్ధకంతో బాధపడతారు.
నిర్లక్ష్యం చేయొద్దు
ప్రస్తుతం చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీదా ఉంటుంది.
ముఖ్యంగా గర్భిణుల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు. చిన్న తనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే, పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు, మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది.
గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకుని, సమస్యకు తగిన మందులు వాడుకోవాలి.
డాక్టర్ పి.అవినాశ్ ఎంబీబీఎస్, ఎండీ, ఫ్యామిలీ ఫిజీషియన్ బంజారాహిల్స్, హైదరాబాద్