calender_icon.png 17 March, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డల్‌నెస్‌ను తరిమేద్దాం?

02-03-2025 12:00:00 AM

కాలుష్యం కారణంగా చర్మం చాలా డల్‌గా.. నిర్జీవంగా కనిపిస్తుంది. దీంతోపాటు కళ్లకింద నలుపు, ముడతలు అసహ్యంగా కనిపిస్తారు. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే సరిపోతుందని చెబుతున్నారు చర్మ సౌందర్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..   

ఒక చెంచా టమాటా గుజ్జు, శనగపిండి, చిటికెడు పసుపు, అర చెంచా నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లు చేసి, కళ్లమీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతివంతం అవుతుంది. 

రెండు చెంచాల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే నిర్జీవంగా ఉన్న చర్మం కళకళలాడుతుంది. 

ఒక చెంచా బటర్‌ని బాగా బ్లెండ్ చేయాలి. అందులో స్ట్రాబెర్రీ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. 

కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లు చేస్తూ.. మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.