calender_icon.png 4 January, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడిని చిత్తుచేద్దాం!

30-12-2024 12:00:00 AM

రిటైర్‌మెంట్ తర్వాత డిప్రెషన్ వద్దు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా.. ప్రతి దశ అనేక సవాళ్లు విసురుతుంటుంది. అయితే మలి వయసులో జీవితం సాఫీగా సాగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ రిటైర్‌మెంట్ తర్వాత చాలామందిని ఒత్తిడి బాధిస్తోంది.

దాంతో నిరాశ, శూన్యత, ఒంటరితనం చుట్టుముట్టి క్లినికల్ డిప్రెషన్‌కు దారితీస్తోంది. అయితే రిటైర్‌మెంట్ తర్వాత ఒత్తిడిని అధిగమించాలంటే ఏం చేయాలో తెలుసా..

హైదరాబాద్‌కు చెందిన అనంతయ్య ఇటీవలనే రిటైర్‌మెంట్ అయ్యాడు. ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు చురుగ్గా ఉండేవాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో బాగా కలిసిపోయేవాడు. అందరికీ మార్గదర్శకుడిగా ఉండేవాడు. ఎప్పుడైతే రిటైర్‌మెంట్ అయ్యాడో కొద్దిరోజులకే ఆయనలో మానసిక మార్పులు కొట్టొచ్చినట్టు కనిపించాయి.

ఇంట్లో ఒంటరిగా ఉండటం, తనలో తానే బాధపడుతూ కనిపించేవాడు. ఇవన్నీ గుర్తించి పిల్లలు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించాడు. ఇలా ఒక్క అనంతయ్య మాత్రమే కాదు.. రిటైర్‌మెంట్ తర్వాత మనదేశంలో ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ డిప్రెషన్స్‌తో బాధపడుతున్నారు. 

మార్పును స్వీకరించకపోవడం

రిటైర్‌మెంట్ డిప్రెషన్ అనేది పదవీ విరమణతోపాటు వచ్చే సమస్య. రిటైర్‌మెంట్‌కు ముందు వ్యక్తులతో సత్సంబంధాలు, పరస్పర చర్యలు చురుగ్గా ఉండనిచ్చేవి. ఆ తర్వాత ఒక్కసారి ఒంటరితనం చుట్టుముట్టడంతో ఆకస్మిక చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండలేక ఒత్తిడి బారిన పడుతున్నారు. అప్పటివరకు డైనమిక్‌గా బతికినవారు సైతం నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి కారణం.. రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే మార్పులను స్వీకరించకపోవడమే.

కారణాలివే.. 

పదవీ విరమణ తర్వాత అనవసర ఆలోచనలు చుట్టుముడుతాయి. దాంతో నిరాశ, ఒంటరితనం అవహించి కుదురుగా ఉండనివ్వవు. అలాగే రోజులన్నీ రొటీన్‌గా ఉండటంతో మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. దాంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పాత జీవితాన్ని కోల్పోయామనే బాధ, నిరాశకు గురిచేస్తుంది. రోజంతా ఇంట్లో ఉండ టం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన చెందడం కూడా కారణాలుగా గుర్తించవచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. 

కనుమరుగైన కుటుంబాలు

సాధారణంగా ఉమ్మడి కుటుంబాలు రిటైర్‌మెంట్ పొందిన వ్యక్తులకు భరోసానిస్తాయి. కానీ ఈకాలంలో ఉమ్మడి కుటుంబాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ‘మేం, మా అనే భావన నుంచి నేను, నా అనే భావనకు’ వచ్చాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలలో కనిపించిన సాన్నిహిత్యం, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయత ప్రస్తుత కుటుంబాలలో కనిపించడం లేదు. దీంతో కుటుం బ వ్యవస్థ క్రమంగా నిర్జీవమవుతున్నది.  వృద్ధులలో పదవీ విరమణ తర్వాత డిప్రెషన్ పెరగడం వెనుక మారుతున్న కుటుంబ నిర్మాణం కూడా ఉంది.

లక్షణాలు

* ఒత్తిడి కారణంగా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు

* మానసిక ప్రశాంతత లేకపోవడం

* జ్ఞాపకశక్తి తగ్గడం

* ఏదో కోల్పోయిన భావన వెంటాడటం

* కుటుంబ సభ్యుల ప్రేమకు నోచుకోకపోవడం.

ఒత్తిడిని జయిద్దాం

* రిటైర్‌మెంట్ తర్వాత ముందస్తు ప్రణాళిక తయారుచేసుకోవాలి

* ఇష్టమైన అభిరుచులతో కాలక్షేపం చేయాలి.

* స్వచ్ఛంద సేవ లేదా పార్ట్‌టైం ఉపాధితో బిజీగా ఉండటం

* ఒంటరితనాన్ని తగ్గించడానికి ఇతరులతో సత్సబంధాలు కలిగి ఉండాలి

* శారీరక శ్రమ ద్వారా ఉల్లాసంగా ఉండాలి.

* ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యాయామం చేయాలి. 

* కొత్త విషయాల పట్ల ఇష్టం చూపాలి.

* సమతుల్య పోషకాహారాన్ని తీసుకోవాలి

* భావోద్వేగాలను నియంత్రించుకోవాలి

* ప్రతి రెండు నెలలకోసారి విహార యాత్ర చేయాలి.