calender_icon.png 15 November, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్ట్ చేసుకో రేవంత్‌రెడ్డి చూసుకుందాం !

15-11-2024 01:00:42 AM

  1. కాంగ్రెస్ కుట్రలకు భయపడటం లేదు
  2. మీ పార్టీని గెలిపించిన పాపానికి రైతులకు అన్యాయమా?
  3. 'ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ కుట్రలకు భయపడేవారు ఎవరూ లేరు. లేనిపోని కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయిస్తారని నాకు ముందే తెలుసు. రైతుల గొంతుకనై నేను గర్వంగా జైలుకు వెళ్తాను. సీఎం రేవంత్‌రెడి ్డనన్ను అరెస్ట్ చేసుకో. తర్వాత చూసుకుందాం ఏదైనా..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.

రైతులకు న్యాయం చేసేందుకు తాను వారి గొంతుకనవుతానని, అవసరమైతే అందుకు జైలుకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించిన పాపానికి రైతులు తమ భూములను కోల్పోవాలా ?’ అని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుకుంటే రాష్ట్రప్రభుత్వానికి కుట్రగా కనిపిస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడు, అల్లుడి కోసం ఫార్మాసిటీ తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకు రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. సర్కార్ రైతుల జీవితాలను రోడ్డున పడేసిందని దుయ్యబట్టారు. ప్రైవేటు సైన్యంతో బిడ్డలను తల్లికి దూరం చేసింది, భార్యను భర్తకు దూరం చేసిన కుట్రలో ఎవరి ప్రమేయం ఉందో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

భూముల కోసం ఎస్టీ రైతులను బూతులు తిట్టించింది, బెదిరించింది కుట్ర కాదా అని ప్రశ్నించారు. రూ.50 లక్షల బ్యాగ్‌లతో (సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగలకు రైతుల కష్టం కుట్రగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

పోరుబాటకు సిద్ధం కావాలి..

తనను రాష్ట్రప్రభుత్వం ఏదో ఒక కేసులో ఇరికించి, జైలుకు పంపించాలని చూస్తున్నదని, సర్కార్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు పోరుబాటకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు.

లగచర్ల కేసులో కేటీఆర్ పేరు రిమాండ్ రిపోర్ట్‌లో ఉండటంపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. తనను అరెస్టు చేసేందుకు పలు డ్రామాలకు తెరలేపుతున్నదని మండిపడ్డారు.

కార్యకర్తలు ఈ పరిణామాలన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్‌కు పోరాటం కొత్తేమీకాదనీ, పార్టీ శ్రేణులు ఇక జనం మధ్యకు వెళ్లి ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగట్టే సమయం వచ్చిందన్నారు.