calender_icon.png 9 October, 2024 | 2:02 PM

కొడంగల్‌’లో ఫార్మాసిటీని ఒప్పుకోం

09-10-2024 11:22:08 AM

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి 

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, 

మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిల అరెస్ట్

కొడంగల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మసిటీపై వస్తున్న అనుమానాలను ప్రజలకు రైతులకు నివృత్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్ ఫార్మా సిటికల్ భూములపై రైతుల పక్షాన పాదయాత్ర చేపట్టే అంశంలో బుధవారం హైదరాబాద్ నుండి పోలేపల్లి గ్రామానికి వస్తున్న క్రమంలో కొడంగల్ నియోజక వర్గం తుంకిమెట్ల గ్రామ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలను పరిగి డిఎస్పి కరుణ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అంశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ నవీన్ కుమార్,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజక వర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతుల తరపున బీఆర్ఎస్ నేతలు సన్నద్ధమయ్యారని తెలిపారు.

ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టిన కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, ఆర్బీతండా, పులిచర్లకుంటతండా, ఈర్లపల్లితండాకు చెందిన పలువురు రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారని వారికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు అందజేస్తుందని అన్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టంచేశారు. గోబ్యాక్‌ ఫార్మా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా విషం ఏంటని ప్రశ్నించారు. కొడంగల్‌లో ఫార్మాను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులతో తమ న్యాయపోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. అనంతరం పోలీసులు తదితరులను అదుపులోకి తీసుకొని వారిని తరలించారు. కొడంగల్‌ సెగ్మెంట్‌లో 1,375 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.