calender_icon.png 23 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూగర్భ జలాలు పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేద్దాం

22-04-2025 11:48:07 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో భూగర్భజలమట్టం పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా తో కలిసి మున్సిపల్ కమిషనర్లు, భూగర్భ జల శాఖ, మిషన్ భగీరథ ఇంజనీర్లు, ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీ శాఖ అధికారులతో కూడిన పర్యవేక్షక కమిటీ సమావేశంలో నీటి వినియోగం, నీటి పొదుపు, భూగర్భ నీటిమట్టం తరిగిపోకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనప కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో భూగర్భ నీటి మట్టాన్ని పెంపొందించేందుకు పర్యవేక్షక కమిటీ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాగునీరు, త్రాగునీరు పొదుపుగా వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని చేతిపంపులు, బావులు, సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు, వ్యవసాయ పంపుసెట్ల పూర్తి వివరాలతో నివేదిక రూపొందించి అందించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో నూతన గృహాల నిర్మాణాలకు అనుమతి కోరేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, నీటిపారుదల శాఖ అధికారులు ప్రభాకర్, గుణవంత్ రావు, మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.