calender_icon.png 23 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విహరిద్దాం.. వీక్షిద్దాం!

23-11-2024 12:01:25 AM

పర్యాటకం.. వినోదమే కాదు, విజ్ఞానమూ అందిస్తుంది. కొత్త ప్రాంతాల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అనేక

చారిత్రక, భౌగోళిక, సంస్కృతీ, సాంప్రదాయాల గురించి తెలుసుకునే వీలుంటుంది. మనదేశంలో పిల్లలకు ఇష్టమైన ట్రావెలింగ్ డెస్టినేషన్స్ ఎన్నో ఉన్నాయి.. వాటిలో కొన్ని చూసేద్దాం

ఆగ్రాలోని తాజ్ మహల్‌ను చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడా చూడలేం అనే భావన కలుగుతుంది. ఎన్నో ఏళ్లు గడిచినా నేటికీ చెక్కుచెదరకుండా ఈ నిర్మా ణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతికత, నిర్మాణ సామగ్రి ఎంతో ప్రత్యేకమైంది. తాజ్ మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతిఒక్కరికీ గుర్తుకొస్తుంది. కానీ ఈ నిర్మాణం పై ఉండే వివిధ డిజైన్లను 28 రకాల విలువైన రాళ్లతో చెక్కారు. దగ్గరగా వెళ్లి చూస్తే స్ప ష్టంగా కనిపిస్తుంది.

దాదాపు 22 సంవత్సరాలపాటు కష్టించి నిర్మించిన ఈ కట్టడంలో వినియోగించిన సామాగ్రి ఎక్కడెక్కడి నుంచి తీసుకువచ్చారు. మనదేశం లోని పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలతో పాటు విదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, టిబెట్, అరేబియా నుంచి తాజ్ మ హల్ నిర్మాణ సామాగ్రిని వాడారు. తాజ్‌మహల్ సందర్శన కచ్చితంగా పిల్లలకు ఎన్నో విషయాలు తెలియజేసేలా చేస్తాయి. 

జైపూర్ జంతు ప్రదర్శనశాల

జైపూర్ జూ, లేదా జూలాజికల్ గార్డెన్ జైపూర్‌లోని ఉత్తమ పిక్నిక్ స్పాట్‌లలో ఒకటి. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం చదువుతున్న పరిశోధక విద్యార్థులు కచ్చితంగా చూడాల్సిన ప్రాంతం. ఈ జూను సందర్శిస్తే వివిధ రకాల జంతువుల ప్రవర్తనను దగ్గరగా గమనించవచ్చు. వీటితోపాటు జైపూర్‌లోని కట్టడాలు, రంగురంగుల పురాతన బిల్డింగ్స్ ఆకట్టుకుంటాయి. జైపూ ర్ కేవలం రాజుల, సైనికుల ధైర్యసాహసాలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తు శిల్పకళను తెలియజేస్తోంది.

కుటుంబ సమేతంగా అమెర్ కోటలో పర్యటించడం చాలా బాగుంటుంది. ఏనుగులపై స్వారీ చేసి కోట వరకు చేరుకోవడం పిల్లలకు మంచి అనుభూతినిస్తుంది. ఈ పర్యటనలో స్థానిక జానపద కథలు, పురాణాలు, రాజ్‌పుత్ రాజుల కథలు లాంటి ఆసక్తికర విషయాలు కూడా తెలుసుకోవచ్చు.

టాయ్ ట్రైన్స్‌లో.. 

మనదేశంలో టాయ్ ట్రైన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న టాయ్ ట్రైన్లు  ఉన్నాయి. ఎత్తున పర్వత ప్రాంతాలు, పచ్చని ప్రకృతి అందాల మధ్య స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ హాయిగా ప్రయాణించవచ్చు. చలికాలంలో ప్రకృతి ప్రేమికుల మనసు దోచే సిమ్లా టూర్ పిల్లలకూ బోలెడు జ్ఞాపకాలను అందిస్తోంది. కల్కా నుంచి సిమ్లాకు మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఐదు గంటల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు.

పర్వత ప్రాంతానికి కింద ఉండే సిమ్లా స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు 102 గుహలు, 87 వంతెనల గుండా 2000 మీటర్ల ఎత్తున్న సిమ్లాకు ప్రయాణిస్తుంది. సిమ్లాను సందర్శించాలనుకునే పిల్లలకు ఇది సరైన డెస్టినేషన్

వన్యప్రాణుల పార్క్

పిల్లలను ఆహ్లదపరిచే వన్యప్రాణాల పార్కులు మనదేశంలో చాలానే ఉన్నాయి. అలాంటివాటిలో రణతంబోర్ అనే నేషనల్ పార్క్ ఒకటి. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పిల్లలతోపాటు వన్యప్రాణుల ప్రేమికులు, ఫోటోగ్రాఫర్‌ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ టైగర్ రిజర్వ్ అనేక పులులకు నిలయంగా మారడంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది జంతు ప్రేమికులు రణతంబోర్ నేషనల్ పార్క్‌ను సందర్శించడానికి ఆసక్తిని చూపుతున్నారు.

ఈ ప్రాంత పర్యటన నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నిత్యం వన్యప్రాణుల డాక్యుమెంటరీలు, చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవన్నీ వీక్షిస్తూ జంగిల్ సఫారీ చేయొచ్చు. ఈ నేషనల్ పార్క్‌ను ఒకసారి విజిట్ చేస్తే చాలు.. జీవితాంతం మరచిపోలేని అనుభవాలను సొంతం చేసుకోవచ్చు. 

అండమాన్‌లో అద్భుత మొక్కలు

బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవులు దేశ పర్యాటకానికే తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడ 223 ద్వీపాలు, అందమైన బీచ్‌లున్నాయి. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లను చూడాలంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లాల్సిం దే. కోల్‌కతా, చెన్ను, విశాఖపట్నం నుంచి ఓడల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే అండమాన్, నికోబార్ దీవుల్లో సుమారు 2200 మొక్కల జాతులున్నాయి. అంతేకాదు.. 225 రకాల సీతాకోక చిలుక జాతులున్నాయి.

ఈ దీవుల్లో మొత్తం 96 వన్యప్రాణి అభయారణ్యాలు, తొమ్మిది నేషనల్ పార్కులు. అండమాన్‌లోని రాధానగర్ బీచ్‌కు 2004లో ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గుర్తింపు లభించింది. ఇక్కడ సముద్రంలో నీటిలో నడిచే సదుపాయం (సీ వాక్) కూడా ఉంది. ఈ దీవులు మినీ ఇండియా ను తలపిస్తాయి. ఇక్కడ అన్నిరకాల భాషలు మాట్లాడేవారు ఉంటారు. అంతేకాదు... అతి పెద్ద తాబేళ్లకు ఈ దీవులు నిలయంగా ఉన్నాయి. అండమాన్ దీవుల్లో వాణిజ్య అవసరాలకు చేపలను వేటాడం నిషేధ ఇక్కడ. ఇన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే మన కరెన్సీ నోటుపై అండమాన్ నికోబార్ దీవుల చిత్రం కనిపిస్తుంది.

మైసూర్ ప్యాలెస్

మైసూరు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ప్యాలెస్. ఈ ప్యాలెస్‌లోకి అడుగు పెడితే లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగిం చిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. దర్బార్ హాల్‌లో బంగారు సింహాసనాన్ని చూడొచ్చు. అందంగా అలం కరించిన ఏనుగులు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. మైసూర్ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించవచ్చు కూడా.

ఇక్కడికి వచ్చే పిల్లలు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేస్తుంటారు. మైసూర్ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. అయితే తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌తోపాటు చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్ లాంటి అద్భుతమైన ప్రదేశాలు పిల్లలను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.