భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డ నాటినుండి నేటివరకూ అనేక పరిణామాల క్రమంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు భాషపట్ల ప్రభుత్వం కినుక వహించినా, పాలకులు పెడచెవిన పెట్టినా అభిమానులంతా భాషా వికాసానికి కంకణ బద్ధులవుతూనే ఉన్నారు. తేనె లొలుకు తెలుగుభాషకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తిం పు ఉంది. అర్ధ శతాబ్దం క్రితం పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగు వ్యావహారిక భాషగా అవతరించడానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషి ఎనలేని ది. 1863 ఆగస్టు 29న జన్మించిన రామమూర్తి జయంతి సందర్భంగానే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
అయితే, తెలుగు భాషాభివృద్ధికి మనమంతా ఏ మేరకు కృషి చేస్తున్నామన్నదే ఆలోచించాల్సిన విషయం. ఏ భాష అయినా మాతృభాష తర్వాతే. శతాబ్దాల నాడే మన అజంత భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటి కే శాతవాహన చక్రవర్తి హాలుడు తన ‘గాధాసప్తశతి’లో తెలుగు పదాలు ప్రయోగించాడు. తెలుగు భాషలో ప్రతీ ఉచ్చారణకూ ఓ ప్రత్యేకాక్షరం వుం ది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషా ప దాలనైనా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా దీనికుంది. అందుకే, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి భాషాభిమానంతో తెలుగును ఇంటర్మీడియ ట్ వరకూ తప్పనిసరి చేయడం హర్షణీయమే అయినా క్షేత్రస్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి 2003 నాటి జీవో 86 ప్రకారం అప్ప టినుంచే రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి అయ్యింది. కానీ, అమలు అటకెక్కింది. ఉన్నత విద్యాస్థాయిలో సైతం ప్రాంతీయ భాషల్లోనే బోధన జరగా లని ఆరున్నర దశాబ్దాల క్రితమే రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది. ఒకటిన్నర పుష్కరాల తర్వాత ఆ వాదనకు కొఠారీ కమీషన్ ఓటేసింది. ఇన్నేళ్లు గడిచినా వాటికి మన్నన దక్కని పరిస్థితి. ఆధునిక కాలంలో తెలుగు పది ప్రపంచ ప్రధానభాషలలో ఆరవస్థానంలో వుందని భాషా పరిశోధకుల అభిప్రాయం. దేశంలో హిందీ మాట్లాడేవారి తర్వాత తెలుగు రెండవస్థానంలో ఉందని నిన్నటి వరకూ గర్వంగా చెప్పుకున్నాం.
కానీ, నేడు దేశంలో బెంగాలీ భాష రెండవ స్థానానికి చేరుకొందని విశ్లేషకులు అన్నారు. ప్రపంచంలోని 6 వేల భాషల్లో 3 వేల భాషలు మృతభాషలుగా మారాయని, కనుక మాతృభాషలను రక్షించుకునేందుకు పూనుకోవల్సిందిగా 1999లో యునెస్కో హెచ్చరించింది. పరాయి భాషల ఆధిపత్య ధోరణులు, వ్యామోహాలవల్ల మాతృభాషలు మృతభాషలుగా మారుతున్నాయన్నది యధార్థ సత్యం. తెలుగు భాషోద్యమకారులు ఇకనైనా నిరంతర కృషి సల్పాలి.
డా.కటుకోఝ్వల రమేష్