calender_icon.png 19 November, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యం కోసం పాటుపడదాం!

19-11-2024 12:00:00 AM

ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ (నేడు) జరుపుతున్నా నేటికీ ప్రపంచంలో 3.5 బిలియన్ల ప్రజలకు పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొనాలి. ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ 2030 నాటికి మంచినీరు, మరుగుదొడ్లు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నా, నేటికీ అనేక దేశాలలో గడ్డు పరిస్థితులే ఉన్నా యి.అనేక పాఠశాలలు, పరిశ్రమల్లో సరైన, చాలినంతగా టాయిలెట్, మంచినీటి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. మన దేశంతో పాటు ఆఫ్రికా దేశాలలో పారిశుద్ధ్య సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. 

ప్రపంచ వ్యాప్తంగా 41.9 కోట్ల జనాభా బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని అంచనా. “సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదు. 11.5 కోట్లమంది ఉపరితల నీటినే తాగుతున్నారు” అని గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 200 కోట్లమంది ప్రజల కు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేవు. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో రోజుకు సుమారు 1000 మంది పిల్లలు (ఐదు సంవత్సరాల లోపు వారు) మరణిస్తున్నారని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ వెల్లడించింది.

ప్రపంచ దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా సహకరించి కనీసం మంచినీరు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పిస్తే ప్రతీ సంవత్సరం 14 లక్షల జనాభాను సజీవులుగా చేయవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇకనైనా సర్వమానవాళి శ్రేయస్సు దృష్ట్యా ఆధిపత్య ధోరణి, ఆక్రమణలు, యుద్ధకాంక్షలు వీడి సమస్యలతో బాధ పడేవారికి చేయూత నిచ్చే పనిలో దేశాధినేతలు ఉండాలి.

‘క్లీన్ టాయిలెట్’ దేశంగా జపాన్

ప్రపంచ దేశాలమధ్య యుద్ధాలు, ఘర్షణలు, భూకంపాలు, సునామీలు, వాతావరణ మార్పు లు వంటి ప్రకృతి వైపరీత్యాలవల్ల కూడా సరైన మంచినీరు, మరుగుదొడ్లు ప్రజలకు అందడం లేదని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో నైజర్, సౌత్ సుడాన్, ఆఫ్రికా దేశాలు టాయిలెట్ సౌకర్యాల్లో అత్యంత వెనుకబడినవిగా నమోదయ్యాయి. ఇక, ప్రపంచం లోనే ‘క్లీన్ టాయిలెట్’ కలిగిన దేశంగా జపాన్ అవతరించింది. డెన్మార్క్, బ్రిటన్, ఫిన్లాండ్, స్వీడన్ వంటి దేశాలు టాయిలెట్ సౌకర్యాల్లో మొట్టమొదటి స్థానాల్లో కొనసాగుతున్నాయి. భారతదేశంలో 2019 నివేదిక ప్రకారం 69.3% శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యా లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, నేటికీ 19.4% శాతం మంది మన దేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. దాదాపు సగం మంది గ్రామ జనాభా బహిరంగ మలవిసర్జన జరుపుతున్నట్లు సమాచారం. నేటికీ పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజల్లో 6% శాతం మంది బహిరంగ మలవిసర్జన గావిస్తున్నారు. 

మనమూ పారిశుద్ధ్యులం కావాలి

2014 అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రారంభించినా అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు. 8 కోట్ల టాయిలెట్ సౌకర్యాలు నిర్మించారు. 419 జిల్లాలను ‘ఫ్రీ ఫ్రం ఓపెన్ డిఫికేషన్’గా ప్రకటించారు. 71% శాతం వరకు మరుగుదొడ్ల సౌక ర్యాలు లభించినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన నిధులు మంజూరు చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థ, ఆరోగ్య, విద్యా, మున్సిపల్, నగర తదితర శాఖలకు మంచినీరు, మరుగుదొడ్లు, శానిటేషన్ వంటి సదుపాయాలకు తగు నిధులు విడుదల కావా లి.

అదే సమయంలో పని ప్రదేశాల్లోనూ ఈ వసతులు ఏర్పాటు చేయాలి. కార్మిక శాఖ తగిన పర్యవేక్షణ జరపాలి. సామాజిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలి. ఎకో ఫ్రెండ్లీ, వీఐపీ వంటి టాయిలెట్ నిర్మాణాలతో మరెంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా ప్రజలు, పౌర సమాజం సరైన అవగాహనకు రావాలి. 

‘వికసిత్ భారత్’లో భాగంగా..

మన దేశంలో కేరళ, సిక్కిం, హిమాచల్ ప్రదే శ్, మిజోరాం, లక్షద్వీప్ వంటి రాష్ట్రాల్లో 100% వంద శాతం మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించి, దేశంలోనే ముందు వరుసలో ఉండ టం అభినందనీయం. ఇక స్వచ్ఛ ఆంధ్ర, తెలంగాణ అని మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ కార్యక్రమా లు చేపట్టాయి.వివిధ పథకాల ద్వారా ముఖ్యం గా ప్రభుత్వ విద్యాసంస్థల్లో టాయిలెట్ సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాలు కొంతవరకు అందుబాటులోకి వచ్చాయి.

మన దేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భావించాలన్నా అందరికీ టాయిలెట్, మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం తప్పనిసరి. వివిధ ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడంతోపాటు వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వ డం అత్యవసరమని అందరూ గ్రహించాలి.

- ఐ.ప్రసాదరావు