06-04-2025 06:30:13 PM
మునుగోడు (విజయక్రాంతి): సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రుణదేవే స్ఫూర్తితో సామాజిక న్యాయ సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణధేవే 35 వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికరంగా శ్రమను దోచుకొని బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరస్తున్న బిజెపి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
కార్మిక వర్గాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో చీల్చి కార్పోరేట్ శక్తులు తమ దోపిడీ కొనసాగిస్తున్నాయని అన్నారు. మనువాదాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని మహిళల, మైనారిటీల, దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ మనుషులంతా ఒక్కటే అంటూ సామాజిక న్యాయం కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని సిఐటియు పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వేముల లింగస్వామి, యాట రాజు, యాస రాణి వంశీ తదితరులు ఉన్నారు.