కష్టపడి చదివిన యువత ఎన్నెన్నో కలలు కంటారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో జాబ్ కొట్టడం నుంచి ఇంటి బాధ్యతలన్నీ తానే తీసుకునే వరకు. తాను కుటుంబ పోషణ బాధ్యత తీసుకోవటం ద్వారా నాన్నకు రిటైర్మెంట్ ఇప్పించడం.. అమ్మ కోసం పెద్ద ఇల్లు తీసుకోవటం.. తోబుట్టువుల్ని బాగా చదివించటం వంటి కలలెన్నో కంటారు. కానీ, డ్రగ్స్ అలవాటయ్యాక ఈ కలలన్నీ కల్లలవుతున్నాయి. డ్రగ్స్ బారిన పడి యువతీ యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ యాడ్ ఫిల్మ్ రూపొందించింది. ఈ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి యువతకు సందేశాన్నిచ్చారు. బాధితులను ఆ మత్తు నుంచి దూరం చేయటం తప్ప శిక్షించటం కాదని, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాల గురించి ‘తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో’కు తెలియజేయండంటూ ఆయన పౌరులను కోరారు. డ్రగ్స్ సమాచారాన్ని 8711871111 నంబర్‌కు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాని చెప్పారు.