- వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులపై జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీలో చర్చ
- వీర జవాన్ కల్నల్ సంతోష్‌బాబు భార్యకు స్థలం కేటాయింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): గ్రేటర్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఇందిరాపార్కు స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు అదనపు నిధుల కేటాయింపు అంశాన్ని జీహెచ్‌ఎంసీ స్థాండింగ్ కమిటీ మరోసారి వాయిదా వేసింది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో ఇంకా రెండోదశ పనులు పూర్తి కాకుండానే అదనపు నిధులు ఎలా కేటాయిస్తాం అని, ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తేనే దీని గురించి నిర్ణయం తీసుకుందాం అంటూ స్టాండింగ్ కమిటీ ఏకాభి ప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో స్టీల్ బ్రిడ్జి కాంట్రాక్టర్‌కు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీలో రెండోసారి కూడా చుక్కెదురైనట్టుగా పలువురు భావిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం స్టాండింగ్ కమిటీ సమా వేశం జరిగింది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలి కాట, స్టాండింగ్ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, ఖదీర్, అర్చన, నజీర్, గౌస్, మన్నె కవితారెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, ఆవుల రవీందర్ రెడ్డి, చింతల విజయ్‌శాంతి, కంది శైలజ తదితరులతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
8 తీర్మానాలకు ఆమోదం..
జీహెచ్‌ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ పెంపుకోసం జీఐఎస్ సర్వే చేపడుతుండగా.. ఈ ఏజెన్సీకి 18నెలల కాంట్రాక్ట్‌తో పాటు అదనంగా మరో 2సంవత్సరాలు నిర్వహణ ఖర్చు తదితర విషయాలపై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. పైప్‌లైన్ రోడ్డు నుంచి కుత్బుల్లాపూర్ మెయిన్ రోడ్ వయా వెన్నెలగడ్డ చెరువు దాకా, వెన్నెలగడ్డ చెరువు కట్ట నుంచి గాయత్రి నగర్ గోదావరి హోమ్స్ వరకూ రోడ్డు వెడల్పుకు ప్రభావితం అవుతున్న 105 ఆస్తులను ప్రతిపాదించగా వాటిని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చేందుకు ప్రభుత్వ అనుమతి కోసం కమిటీ ఆమోదం తెలిపింది. కిషన్‌బాగ్ జంక్షన్ అభివృద్ధ్ది పనుల్లో భాగంగా ప్రభావితం అయ్యే 418 ఆస్తుల సేకరణ చేపట్టాలని ప్రభుత్వ ఆమోదానికి సిఫార్సు చేశారు. చాదర్‌ఘాట్ వద్ద మూసీ నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రోడ్డు వెడల్పు చేసేందుకు ప్రభావితం అయ్యే 35 ఆస్తులను సేకరించాలని తదితర మొత్తం 8 రకాల తీర్మాణాలను స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
కల్నల్ సంతోష్ భార్యకు 711 గజాల స్థలం కేటాయింపు..
2020లో ఇండో యుద్ధంలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లో 711 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని టేబుల్ అంశంగా స్వీకరించి తీర్మాణం చేశారు. సంతోషికి గత ప్రభుత్వ హయాంలోనే స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక స్థలం కేటాయిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.