calender_icon.png 22 October, 2024 | 1:05 PM

లెట్స్ సెలబ్రేట్ పీరియడ్స్ ఫెస్టివల్!

25-06-2024 12:05:00 AM

పీరియడ్స్ అనేది చాలా సాధారణమైనది. ఆడపిల్లలు తమ పీరియ డ్స్‌ని ఇబ్బందులతో గడుపుతున్నారు. సమాజంలో రుతుక్రమం అనేది ఏదో పెద్ద దోషం. అవమానకరంగా చూస్తోన్నది. చాలా మంది ఇళ్ళల్లో పీరియడ్స్ వస్తే వంటగదిలోకి అనుమతి లేదు. కొన్ని ప్రాంతాల్లో పవిత్రమైన దేవాలయాలు, పవిత్ర స్థలాలల్లోకి వెళ్లలేరు. ఇదేదో నిషేధిత పదంగా వాడుతుంటారు. ఆ మూడు రోజులను దాచాలని.. స్త్రీలు రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు.

ఇతరులను ముట్టుకోవద్దని గదికే పరిమితం కావాలని.. టీవీలో నాప్కిన్ యాడ్స్ వస్తే ఛానల్ మార్చేయడం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్న దేశంలో ఒడిశా రాష్ట్రం మాత్రం ఋతుస్రావంను సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం పండుగను నిర్వహస్తుంది. దీన్ని ‘రాజా పర్బ’ లేదా ‘మిథున సంక్రాంతి’ అని పిలుస్తుండగా.. ఈ ఫెస్టివల్ ప్రత్యేకతలు తెలుసుకుందాం..

ఈ పండుగను వానకాలం ప్రారంభానికి గుర్తుగా చెబుతారు. ఈ కాలంలో భూమి ఋతు చక్రం గుండా వెళుతుందని విశ్వసిస్తూ.. స్త్రీ లింగ అంశాలను గౌరవిస్తుంది. ‘రాజా’ అనే పదం ‘రజస్వల’ నుంచి తీసుకోబడిందని.. ‘ఋతుస్రావంతో ఉన్న స్త్రీ’ అని అర్థం. రాజా పండుగ మూడు రోజుల పాటు జరుపుకుంటుండగా.. ప్రతి రోజు ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. 

భారతీయ పండుగలు లేదా సందర్భాల మాదిరిగానే.. రాజా పర్బకు సంబంధించి కూడా ఒక పురాణ కథ ఉంది. స్త్రీ శక్తికి ప్రతిరూపమైన భూమి తల్లిగా పిలవబ డేది. జూన్ మధ్యలో మూడు రోజులు ఋతుస్రావం గుండా వెళుతుందని చెబుతారు. పండుగ మొదటి రోజు ‘పహిలి రాజా’, రెండవ రోజు ‘రాజ సంక్రాంతి’, మూడవ రోజు ‘బసి రాజా’ గా జరుపుకుంటారు. ఆ తరువాత రోజు.. ‘వసుమతీ స్నాన’ అని పిలుస్తారు. ఆ రోజు భూమి శక్తి లేదా ‘భూదేవి’ కర్మ స్నానం చేసి.. ఆమె కాల చక్రాన్ని ముగిస్తుంది. కాగా ఒడిశాలో రాజా పండుగ వేడుకలు ‘భూదేవి’ మనకు ఇచ్చే సారవంతమైన భూమిని గౌరవించడానికి, మంచి పంట కోసం జరుపుకునే పండుగ. 

రాజా పర్బ అనేక విభిన్న కార్యక్రమాలతో జరుపుకుంటారు. పహిలి రాజా, రాజా సంక్రాంతి, బసి రాజా రోజున.. మహిళలు తమ రోజువారీ పనుల నుంచి విరామం తీసుకుంటారు. శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. కొత్త బట్టలు, సాంప్రదాయ ఆభరణాలు ధరించి.. వారి పాదాలకు ఆల్తాను పూసుకుంటారు. ఇది భూమితో వారి అనుబంధానికి చిహ్నం. కాగా అమ్మాయిలు, స్త్రీలు.. ఊయలను అలంకరించి ఊగుతూ ఆడుకుంటారు. జానపద పాటలు పాడుతూ ఆనందంగా జరుపుకునే మూడు రోజుల పండుగ రాజా పర్బ. ఇది పీరియడ్స్‌కు సంబంధించిన అద్భుతమైన ఫెస్టివల్‌గా చెప్పుకుంటారు.