calender_icon.png 27 December, 2024 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపిరి పీల్చుకుందాం

04-12-2024 03:52:12 AM

వాతావరణం ఒక్కసారిగా మారింది. చలి పంజా విసురుతోంది. చలిమాటున అనేక వ్యాధులు పొంచి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఒకవైపు శ్వాస సమస్యలు, మరోవైపు తీవ్ర వాయుకాలుష్యం కారణంగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్వాస సమస్యలను ఎలా అధిగమించాలి? లాంటి విషయాలు తెలుసుకుందాం.. 

ప్రస్తుతం చాలామంది తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా అలాంటి సమస్యలబారిన పడినట్లయితే.. సమయానికి వైద్యం చేయించుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. లేదంటే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. మన గుండె, ఊపిరితిత్తులు రక్తం ద్వారా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని కణజాలాలకు అందజేస్తాయి. అంతేకాకుండా.. కార్బన్‌డయా క్సైడ్ బయటకు పంపుతాయి. ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఊపిరితిత్తులకు తగినంత ఆక్సిజన్ అందని శ్వాసలోపం సమస్యను ‘డిస్ప్నియా’ అంటారు. ఈ సమస్య వల్ల ఛాతీలో బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతారు. 

సమస్యకు సంకేతాలివే

శ్వాస సమస్య చాలా రోజులపాటు ఉన్నట్లయితే.. అది తీవ్రమైన వ్యాధులకు సంకేతం. దీనివల్ల ఆస్తమా, ఊపిరితిత్తులలోని శ్వాస నాళాలను ప్రభావితం చేస్తాయి. దీనికి త్వరగా దీర్ఘకాలిక చికిత్స అవసరం. అందువల్ల సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్స చాలా ముఖ్యం. నిరంతరం శ్వాస సమస్యలు వల్ల కార్డియోమయోపతి (గుండె కండరాల సమస్య) లాంటి అనేక తీవ్రమైన గుండె జబ్బులకు సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్ని సకాలంలో పట్టించుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. మానసిక ఒత్తిడి లేదా భయం ఆకస్మిక శ్వాస సమస్య బారినపడేలా చేస్తాయి. అయితే తరచుగా ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే జాగ్రత్త వహించాలి. శ్వాస ఆడకపోవడం అనేది చాలా సందర్భాల లో ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలకు సంకేతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక శ్వాస సమస్యలు కొన్నిసార్లు తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తాయి.

శ్వాస నాళికలు బిగుసుకుపోతే

శీతాకాలంలో ప్రారంభంలోనే గాలిలో వచ్చే మా ర్పులకు జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు, శ్వాస కోశ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈకాలంలో ఎక్కువగా జలుబు అయి ముక్కు కారుతుంటుంది. దీంతో చెవి దగ్గర గడ్డలా వాపు వచ్చే ప్రమాదం సైతం ఉన్నా యి. దీని వల్ల శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతుంది. కండరాలు బిగుసుకుపోవడంతో మోచేయి, మోకాలు, ఇతర జాయింట్‌లలో నొప్పులు వస్తుంటాయి. రక్తనాళాలు కుచించుకుపోతే గుండెకు రక్తప్ర సరణలోలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇది చాలా ప్రమాదకరం. శ్వాస నాళిక కండరాలు బిగుసుకుపోతాయి. దీంతో గాలి పీల్చడంలో ఇబ్బంది ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

శ్వాస ఎలా తీసుకోవాలి

శ్వాస తీసుకునే విధానానికి, ఆరోగ్యానికి చాలా సంబంధం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. శ్వాస తీసుకోవడంలో ఉండే లోపాల వల్లే ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతున్నాయని చెబుతున్నారు. అసలు శ్వాస సరిగ్గా తీసుకోవడం తెలిస్తే అన్ని మానసిక సమస్యలు మాయమవ్వడంతోపాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అసలు శ్వాస ద్వారానే శరీరానికి ప్రాణశక్తి అందుతుంది. శ్వాస ద్వారా అందే ఆక్సిజన్ శాతాన్ని బట్టి, రక్త కణాల వృద్ధి, రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె పనితీరు ఆధారపడి ఉంటాయి. మెరుగైన ఆరోగ్యం కోసం శ్వాస తీసుకునే విధానాలపై కనీస అవగాహన ఉండాలని చెబుతున్నారు డాక్టర్లు. 

ముక్కు ద్వారా మాత్రమే: ముక్కు అనేది శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. బయట్నుంచి తీసుకునే గాలిని ముక్కు ఫిల్టర్ చేసి ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ఇది వైరస్‌ను, బ్యాక్టీరియాలను నిరోధించడంలో సాయపడుతుంది. కాబట్టి శ్వాస ఎప్పుడూ ముక్కు ద్వారానే జరగాలి. చాలామంది నిద్రించే సమయంలో నోటి ద్వారా గాలి తీసుకుంటుంటారు. అలా జరగకుండా జాగ్రత్తపడాలి. 

స్లో బ్రీతింగ్: శ్వాస ఎంత నెమ్మదిగా సాగితే మెదడు అంత ప్రశాంతంగా ఉంటుంది. కోపంగా ఉనప్పుడు, ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నప్పుడు శ్వాస పెరగడాన్ని మనం గమనించొచ్చు. శ్వాస వేగానికి మెదడు పనితీరుకి లింక్ ఉందని తాజా సర్వేలు కూడా చెప్తున్నాయి. కనీసం ఆరు సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం ఆరు సెకన్ల పాటు విడిచిపెట్టడం అలవాటుగా మారితే ఆరోగ్యానికి చాలా మంచిది.

నిర్లక్ష్యం చేయొద్దు

శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అధిక జ్వరం, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతుంటారు. అయితే ఎక్కువ రోజులు బాధపడితే ముక్కు లోపల కండరాలు పెరుగుతాయి. వాసన గ్రహించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ముక్కు లోపలి పొరలు దురద, మంట వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. జలుబు లేకపోయినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుం టే ముక్కు లోపలి పొరలో పాలిప్స్ పెరగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సైనస్ సర్జరీతో పాలిప్స్‌ను తొలగించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలుగుతాయి.

 ఈ జాగ్రత్తలు తప్పనిసరి

* చలికాలంలో వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. 

* శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

* ఐస్‌క్రీం, చల్లని నీళ్లు, జ్యూస్‌లు తాగడం వల్ల జలుబు, శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. వాటికి దూరంగా ఉండాలి.

* శరీరానికి వేడినిచ్చే జొన్నలు, ఆకుకూరలు, సజ్జలు వంటి ఆహారంగా తీసుకోవాలి. 

* రాత్రి వేళలో బయటకు వెళ్లకుండా ఉండాలి. అత్యవసరం అయితే తప్పనిసరిగా చలి నుంచి శరీరాన్ని రక్షించే ఉన్ని దుస్తులు ధరించాలి. చెవుల్లోకి చల్లని గాలి వెళ్లకుండా రక్షణ కలిగించే దుస్తులు వేసుకోవాలి.

* చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇంట్లో వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. అందుకు ఇంట్లో, ఇంటి పరిసరాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి.

 * తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. జలుబు, దగ్గు ఉన్న వారు తప్పనిసరిగా చేతిరుమాలు వెంట పెట్టుకుని అడ్డుపెట్టుకోవాలి.

కచ్చితంగా మాస్కులు ధరించాలి

చలికాలంలో ఎక్కువ ఆస్తమా, బ్రాంకైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రభావం చూపుతాయి. చల్లగాలిలో తిరగడం వల్ల ఆస్తమా స్థాయిలు పెరుగు తాయి. దాంతో దగ్గు, జలుబు ఎక్కువగా వస్తుం ది. ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడుతారో.. జ్వరం, జలుబు, దగ్గు లాంటివి వస్తాయి. జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఒకటి రెండు రోజుల్లో జ్వరం, జలుబు తగ్గుతుంది.

కానీ దగ్గు వారంరోజుల పాటు బాధిస్తుంది. అలాగే చాలామంది మార్నిం గ్ వాక్‌కు వెళ్తుంటారు. అయితే చెట్ల, మొక్కల పుప్పొడి పీల్చడం వల్ల జలుబు లాంటివి అటాక్ చేస్తాయి. కాబ ట్టి బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే ముందు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలి. ఆయాసంతో బాధపడేవారు ఇన్‌హెలర్ వాడటం మంచింది. చలికాలంలో క్రమతప్పకుండా మంచినీరు తాగడం మరవకూడదు.

-డాక్టర్. ప్రపుల్ల చంద్ర, ఎంబీబీఎస్, ఎండీ

పల్మోనాలజిస్ట్, అపోలో స్ప్రెక్టా

హైదరాబాద్