calender_icon.png 19 November, 2024 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు జలాల రక్షణకు నడుం బిగిద్దాం

30-07-2024 12:00:00 AM

సుప్రసిద్ధ భారతీయ పర్యావరణ, నీటి సంరక్షణవేత్త అనుపమ్ మిశ్రా అభివృద్ధి పరిచిన వినూత్న నీటి నిర్వహణ విధానమే ‘ఫోర్ వాటర్స్’ భావన. ఇది నాలుగు రకాల నీటి వనరుల (వర్షపు నీరు, భూగర్భ జలాలు, ఉపరితల జలాలు, నేల తేమ) స్థిరత్వాన్ని నొక్కి చెబుతుంది. ఈ వ్యూహానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటి పారుదల ఇంజినీర్ దివంగత టీ. హనుమంతరావు విస్తృత ప్రచారం చేశారు. ముఖ్యంగా కాలానుగుణ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తు ఉపయోగానికి వర్షపు నీటిని నిల్వ చేయడం ఇందులో ప్రధాన కార్యం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, చెరువులు, కుంటలు వంటి పద్ధతుల ద్వారా దీనిని సాధించవచ్చు. 

వర్షపు నీరు మట్టిలోకి చొచ్చుకుపోయేలా చేయడం, జలాశయాలను తిరిగి నింపడం ద్వారా భూగర్భజల వనరులను రీఛార్జ్ చేయగలుగుతాం. చెక్ డ్యామ్‌లు, రీఛార్జ్ వెల్స్, కాంటూర్ ట్రెంచ్‌లను నిర్మాణాలు వంటి సాంకేతికతలు భూగర్భ జలాల రీఛార్జ్‌ను పెంచడానికి ఉపయోగపడతాయి. వీటిద్వారా నదులు, సరస్సులు, రిజర్వాయర్ల వంటి ఉపరితల నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించ గలుగుతాం. ఈ రకంగా వ్యవసాయ, గృహ, పారిశ్రామిక అవసరాలకు స్థిరమైన నీటి సరఫరాను ఏర్పరచుకోగలం. నీటి వనరులను కాలుష్యం నుండి రక్షించడం, ప్రవాహాల నిర్వహణ, ఆనకట్టలు, చెరువుల నిర్మాణాలూ ఇందులో భాగమే. మల్చింగ్, కాంటూర్ దున్నడం, అడవుల పెంపకం వంటి తగిన భూనిర్వహణ పద్ధతులద్వారా నేల తేమను సంరక్షించడమూ జరుగుతుంది. ఈ పద్ధతులన్నీ నేలలో నీటిని నిలుపుకోవడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవడానికి, నేల కోతను తగ్గించడానికి బాగా దోహదపడతాయి. 

శుష్క, పాక్షిక- శుష్క ప్రాంతాల్లో కమ్యునిటీలు, వ్యవసాయం పర్యావరణ వ్యవస్థలలో మద్దతునిచ్చే స్థిరమైన, స్థితిస్థాపక నీటి సరఫరా వ్యవస్థను రూపొందించడమే ‘ఫోర్ వాటర్స్’ భావన లక్ష్యం. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో, కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుంది. పైకప్పులనుంచి వచ్చే వర్షపు నీటిని నిలువ చేసే వ్యవస్థల నిర్మాణం ఇందులో భాగమే. వర్షపు నీటిని ట్యాంకులలో నిల్వ చేయవచ్చు లేదా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి మళ్లించవచ్చు. కమ్యునిటీ- లెవల్ హార్వెస్టింగ్ ద్వారా వర్షపు నీటి ప్రవాహాన్ని సంగ్రహించడానికి పెద్ద కమ్యునిటీ చెరువులు లేదా కుంటలను నిర్మించాలి.

పొడి కాలంలో ఈ నిర్మాణాలు కీలకమైన నీటి వనరులుగా ఉపయోగపడతాయి. కాలానుగుణ ప్రవాహాలు, నదులపై చెక్‌డ్యామ్‌లను నిర్మించడం వల్ల తరచుగా మట్టి లేదా కాంక్రీటు అడ్డంకులు నీటి ప్రవాహాన్ని నెమ్మదిస్తాయి. ఇది భూమిలోకి చొచ్చుకు పోయేలా చేస్తుంది. రీచార్జ్ వెల్స్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చేయడానికి, జలాశయాలను తిరిగి నింపడానికి వ్యూహాత్మక ప్రదేశాలలో ‘పెర్కోలేషన్ పిట్స్’, రీఛార్జ్ బావులను తవ్వించాలి. ప్రవాహాన్ని తగ్గించడానికి, భూగర్భజలాల రీఛార్జ్‌ను పెంచడానికి వ్యవసాయ భూమిపై కాంటౌర్ ట్రెంచ్‌లు, బండ్లను నిర్మించాలి. సంప్రదాయ చెరువులు, కుంటల పునరుద్ధరణతో వాటి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, బాష్పీభవన నష్టాలను తగ్గించడం వంటివీ చేయవచ్చు.

ప్రభుత్వం ముందుకు రావాలి

ఇంటర్ లింకింగ్ వాటర్ బాడీస్ ద్వారా ఒక దానితో ఒకటి అనుసంధానితమైన చెరువులు, కుంటల వ్యవస్థలను రూపొందించుకోవాలి. ఒక ప్రాంతం నుండి మిగులు నీటిని మరొక ప్రాంతానికి మళ్లించడం ద్వారా నీటి కొరత తగ్గుతుంది.  ఉపరితల నీటి లభ్యత, నేల తేమ సంరక్షణను మెరుగు పరచడానికి వాటర్ షెడ్లను అభివృద్ధి చేయాలి. ప్రవాహాలు, కోతలను తగ్గించడానికి అటవీ పెంపకం, నేల సంరక్షణ చర్యలు వంటివి చేపట్టాలి. వ్యవసాయానికి మద్దతుగా నేల కోతను తగ్గించి తేమను నిలుపుకోవాలి.

నేల ఉపరితలాన్ని కవర్ చేయడానికి, తేమను నిలుపుకోవడానికి, బాష్పీభవనాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. తద్వార నేల నాణ్యత మెరుగు పడుతుంది. నేల తేమను నిలుపుకోవడంలో సహాయపడే పరిరక్షణ సాగు పద్ధతులను రైతులు అనుసరించాలి. ఆగ్రో ఫారెస్ట్రీని మెరుగు పరుచుకోవాలి. కమ్యునిటీ ఇన్వాల్వ్‌మెంట్, కెపాసిటీ బిల్డింగ్, రైతులు, స్థానిక నివాసితులకు వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, నేల తేమ సంరక్షణ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలి. ఈ మేరకు ప్రజలకు తగిన అవగాహన కల్పించినప్పుడే వ్యవసాయం మనుగడ, సాగునీరు, తాగునీటి ఎద్దడి నివారణ సాధ్యమవుతాయి.          

 డా. యం. సురేష్‌బాబు