పుస్తకాలు దీపాలవంటివి. వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది-డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది. పుస్తకం సామాన్యుని ఆయుధం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆ మాటలు నేటికీ పుస్తక ప్రియుల చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఒక మంచి పుస్తకం వేయి మంది మిత్రులతో సమానమని అన్నారు మరో మహానుభావుడు.
ఒంటరితనంలో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు పుస్తకం. పుస్తకం అమ్మలా లాలిస్తుంది, నాన్నలా ఆదరిస్తుంది, గురువులా హితబోధ చేస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధం గా, నేస్తంగా అన్ని తరాలను అలరిస్తోంది. పుస్తక ప్రచురణ ప్రారంభమయిన తర్వాత మానవ జీవన గమ నంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఉదయం టీ తాగితే వచ్చేంత హాయి పుస్తక పఠనంతో వస్తుంది అంటారు పుస్తక ప్రియులు. ప్రస్తుతం అన్ని వయసుల వారు పుస్తకాలకు దూరమై టీవీ చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ మానవ సంబంధాలు లేకుం డా ఒంటరి జీవితానికి అలవాటు పడడం శోచనీయం. పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొని చూడడం తప్ప చదవడానికి ఆసక్తి చూపడం లేదు.
‘మనల్ని గుచ్చి గాయపరిచి ఇబ్బంది పెట్టే రచనలు చదవాలి. మంచి పుస్తకం మనలో దాగి వున్న ప్రతిభను, సృజనను తట్టి లేపాలి. పుస్తక పఠనం మనలో గడ్డ కట్టిన సముద్రాన్ని గొడ్డలి లాగా పగుల కొట్టాలి’ అంటాడు ప్రముఖ రచయిత కాఫ్కా. ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగావేరు వేరు (విభిన్న) తేదీలలో జరుపుకుంటున్నప్పటికీ ఇన్ని ప్రత్యేకతలు వున్న ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా పాటించాలని 1955లో యునెస్కో ప్రకటిం చింది.అంతే కాకుండా ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణ కర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజు గౌరవించాలని సూచించింది.
ప్రపంచంలో పుస్తకాలు చదివే చదువరుల సంఖ్యమీద జరిపిన సర్వేలో భారతదేశంలో చదివే వారు ఎక్కువ ఉన్నట్టు తేలింది. భారతీయులు వారానికి సగటున 10.2 గంటలపాటు పుస్తక పఠనం చేస్తారని దశా బ్దం కింద చేసిన ఒక అధ్యయనంలో తేలింది. 2013 నాటి సర్వే ప్రకారం పుస్తక పఠనం సమయం 10.4 గంటలకు పెరిగింది. టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్ వినియోగం, మారుతున్న జీవనశైలివల్ల పుస్తక పఠనంపై మోజు తగ్గకపోవడం విశేషం.
పుస్తక పఠనంలో భారత్ టాప్‌లో వుండడం గర్వించదగిన అంశం. పుస్తక పఠనం చేసే వారి సంఖ్య మరింత పెరగాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఆన్‌లైన్‌లో చదువుతున్నారు. అందుకే కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగా పుస్తక పఠనం పట్ల ప్రజల్లో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా పుస్తక ప్రదర్శన, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలపై సెమినార్లు , సదస్సులు, వివిధ ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించడం గమనార్హం.
పుస్తకాలు కొని చదివే సంస్కృతిని పెంపొందించడం, పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవలు గుర్తు చేసుకోవడం, కొత్త తరాలను పుస్తక పఠనంవైపు ఆకర్షించడం, యునెస్కో ఆశయాలసాధన దిశగా కృషి జరగాలి. కాగా హైదరాబాద్‌లో గత 37 ఏళ్లుగా కొనసాగుతున్న పుస్తక ప్రద ర్శన (బుక్‌ఫెయిర్) ఏటా లక్షలాది మంది పుస్తక ప్రియులను ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 19న ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన పుస్తకాభిమానులకు ఓ పెద్ద పండగేనని చెప్పాలి.
- నేదునూరి కనకయ్య