ఎన్‌బీఎఫ్‌సీలకు రిజర్వ్‌బ్యాంక్ ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: నాన్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీలు) పెట్టుబడులు చేసిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ అబ్జర్వర్ల పేరిట బాధ్యతలేని పదవుల్లో కూర్చోపెట్టడాన్ని రిజర్వ్‌బ్యాంక్ తీవ్రంగా వ్యతిరేకించింది. వివిధ ఫండ్స్ నియమించిన అబ్జర్వర్లను సాగనంపాలంటూ ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్బీఐ ఆదేశించింది. ఎన్‌బీఎఫ్‌సీల్లో ఇన్వెస్ట్‌చేసిన ఫండ్స్ వాటి ప్రతినిధుల్ని డైరెక్టర్లుగా బోర్డుల్లో నామినేట్ చేసుకోవాలని, డైరెక్టర్లయితే వారి నిర్ణయాలకు చట్టబద్ధంగా బాధ్యులు అవుతారని బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచించింది.
ఎన్‌బీఎఫ్‌సీల్లో ఫ్రాడ్స్. నిధుల మళ్లింపు, పాలనా సంబంధితలోపాలు జరిగిన సందర్భాల్లో డైరెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, సివిల్, క్రిమినల్ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే ఫండ్స్ వాటి ప్రతినిధుల్ని డైరెక్టర్లుగా కాకుండా అబ్జర్వర్లుగా నామినేట్ చేస్తున్నాయని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్బీఐ హెచ్చరించింది. అబ్జర్వర్ల రాజీనామాలను కంపెనీలు కోరాలని, అటుతర్వాత డైరెక్టర్లుగా వారి నియామకాల్ని పరిగణనలోకి తీసుకోవచ్చని ఎన్‌బీఎఫ్‌సీలకు సూచించింది.