సాధారణంగా ప్రభుత్వ అధికారాన్ని హస్తగతం చేసుకున్న నాయకులు ప్రజాస్వామ్య ముసుగులో తమకు తిరుగులేదనుకుంటారు. ముఖ్యం గా నియంతృత్వ ధోరణి గలవారు తమ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని చూసి భరోసాతో ఉంటారు. మారణాయుధాలతో కాపలా కాస్తున్న పోలీసులు,సైనికుల శక్తి,సామర్థ్యాలపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. తమ ప్రాణాలు కాపాడటానికి వారికి కఠినమైన శిక్షణ ఇస్తారు. అయినా వారి ప్రాణాలకు రక్షణ లభించినట్లేనా? ఇందిరాగాంధీ మరణం ఏం చెబుతుంది? ఆమె రక్షక భటులే యమ భ టులయ్యారు.
మొన్న బంగ్లాదేశ్ సంక్షోభ సమయంలో ఆందోళనకారులు ప్రధాని షేక్ హసీనా నివాస భవనాన్ని చుట్టుముట్టినప్పుడు సైన్యం చేతులెత్తేయడంతో విధి లేక ప్రాణభయంతో దొడ్డిదోవన ఇండియాకు పారిపోయి వచ్చారు. సైనిక బలగా న్ని చూసుకొని విర్రవీగిన హిట్లర్ ఆత్మహ త్య చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంక పాలకులను ఆ దేశ ప్రజలు తిరుగుబాటు చేసి తన్ని తరిమేశారు.ఇటలీ నియంత ముసోలినీని ఆ దేశ ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపిం ది.
ఇప్పుడు ఇజ్రాయెల్‌లోనూ ప్రధాని నెతన్యాహు కూడా తన ఇంటెలిజెన్స్ వ్యవ స్థ మొసాద్‌ను, అపార సైనిక శక్తిని, సాంకేతిక నైపుణ్యాన్ని, అమెరికా ఆయుధాలను నమ్ముకున్నారు. అమెరికా అండదండలతో తనకు ఈ ప్రపంచంలో తిరుగులేద ని మిడిసి పడుతున్నారు. పశ్చిమాసియా ను నిత్యాగ్నిగుండంగా మారుస్తున్నారు. గాజా,లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపించి పసిపిల్లలు, స్త్రీలు, వృద్ధుల ప్రాణా లనూ తీస్తున్నాడు. బాంబుల వర్షంతో ఇళ్లు స్కూళ్లు, ఆసుపత్రులు,ఆస్తులను విచక్షణ లేకుండా సర్వనాశనం చేస్తున్నాడు. అయినా ఆ నియంత అహం శాంతించటం లేదు.
చరిత్ర అంటే నియంతలకు భయం
తనకు ఇజ్రాయెల్ ప్రజల మద్దతు లేదని నెతన్యాహుకు క్షుణ్ణంగా తెలుసు. ఎన్నికలు సజావుగా జరిగితే తనకు తన దేశంలో దారుణమైన ఓటమి తప్పదనీ తెలుసు. తనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్, ఇంగ్లండ్, ఇటలీ, జర్మనీ, చివరకు అమెరికాలోనూ ప్రజలు నిరసన ర్యాలీలు చేస్తు న్న విషయమూ తెలుసు. అయినా నియంతలు చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకో రు. వారికి చరిత్ర అంటే చచ్చేంత భయం. అందుకే నియంతలు గత చరిత్రను నామరూపాలు లేకుండా చేయాలనుకుంటారు. చరిత్రలో కొన్ని పేజీలు చింపేస్తే గతం మాయం అవుతుందా...!!
కానీ వారిని చరిత్ర వెన్నాడుతూనే ఉం టుంది. గతం లేనిదే వర్తమానం, వర్తమానం లేనిదే భవిష్యత్తూ ఉండదు. ఇప్పు డు పైకి చూడటానికి ఇజ్రాయెల్-గాజా యుద్ధం తుది దశకు చేరుకొన్నట్టే కనిపిస్తున్నది. ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాజాను వల్లకాడుగా మార్చింది. దాదాపుగా హమాస్ కీలక నేతలను తుడిచి పెట్టింది. ఇస్మాయి ల్ హనియే, యాహ్యా సిన్వర్ మరణంతో హమాస్ ఉనికి కోల్పోయినట్టే పైకి కనిపిస్తుంది. కానీ ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు హమాస్ గానీ యుద్ధాన్ని ఆపేస్తామని ఎవరూ, ఎక్కడా, ఎలాంటి ప్రకటనా చేయలేదు.
నివురుగప్పిన నిప్పులా అంతర్గతం గా పగతో హమాస్ దళాలు రగిలిపోతూనే ఉన్నాయి. దానికి ఇప్పుడు లెబనాన్, ఇరా న్ తోడయ్యాయి. చారిత్రకంగా చూస్తే ఇజ్రాయెల్ -పాలస్తీనా సమస్య ఈ నాటి ది కాదు. హమాస్‌కు కూడా సుదీర్ఘ పోరా ట చరిత్ర ఉన్నది. హమాస్‌కు... ఆ మాటకొస్తే పోరాట యోధులకు నాయకత్వాన్ని కోల్పోవటం కొత్తేమీ కాదు. ఇకపై హమా స్, గాజా సమస్యే ఇజ్రాయెల్ కు ఉండకూడదన్న ఉద్దేశంతో నెతన్యాహు యుద్ధంలో బీభత్సం సృష్టిస్తున్నారు.
గాజాను పూర్తిగా ఆక్రమించుకోవటమో.. లేదంటే చివరికి హమాస్ మిలిటెంట్లను సంపూర్ణంగా అంతం చేయటమో లక్ష్యంగా ఇజ్రాయెల్ దూకుడు ప్రదర్శిస్తున్నది. మరోవైపు లెబనాన్‌లోనూ హెజ్బొల్లానూ తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లాను చంపేసింది. హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీం కూడా చావుభయం తో ఇరాన్‌కు పారిపోయాడని వార్తలు వచ్చాయి. ఇస్మాయిల్ హనియేను ఏకం గా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోనే కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో ఇజ్రాయె ల్ గురితప్పకుండా చంపేసింది.
సమస్య ఉన్నంత కాలం..
గాజా, పాలస్తీనా సమస్య ఉన్నంత కాలం ఇలాంటి సంస్థల మనుగడ కొనసాగుతూనే ఉంటుంది. సైనిక అణచివేత ఉన్నప్పుడు దెబ్బతిన్న ప్రతీకార దళాలు ఒకడుగు వెనక్కు తగ్గుతాయి. అంత మాత్రం చేత ఓటమిని అంగీకరించినట్లు కాదు. గెరిల్లా పోరాటంలో ఇలా సైలెంటు గా యుద్ధ భూమినుంచి నిష్క్రమించటం, శత్రువు విజయగర్వంతో ఆదమరిచినప్పుడు ఒక్క సారిగా పంజా విసరడం ఈ తీవ్రవాద దళాలకు మామూలే.
భవిష్యత్తులో హమాస్ పేరుతో కాకపోయినా మరో పేరుతో వారి వారసులు అదను చూసి ప్రతీకారం తీర్చుకోవటం గెరిల్లా పోరాటం ఎత్తుగడల్లో మామూలే. ఇప్పు డు హమాస్, హెజ్బొల్లాలు మరో సంస్థ, మరో పేరుతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటాయా! కాకపోతే దెబ్బతీసే విధానాల్లో తేడాలుండొచ్చు. హమాస్ తిరిగి పుంజుకోవటానికి సమ యం పట్టవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో పోరాడుతున్న హమాస్, హెజ్బొల్లా నాయకత్వమంతా ఒకప్పుడు పాలస్తీనా యుద్ధ బాధిత శిశువులే కదా.
ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధం వల్ల లక్షల మంది శరణార్థి శిబిరాల్లో అత్యంత దారిద్ర భరిత జీవితం గడుపుతున్నారు. అలాంటి ఒక శరణార్థి శిబిరంలోనే పుట్టిన యాహ్యా సిన్వర్ మరణించాడు. హమాస్ లాంటి సంస్థలు, సిన్వ ర్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాద నేతలు పుట్టుకు రావటానికి ఇంతకం టే ఉత్తమ ప్రదేశాలు ఉంటాయా!?
పగ రగులుతూనే ఉంటుంది
ఇజ్రాయెల్ పంతం ప్రకారం హమాస్‌ను అంతం చేస్తోంది, హెజ్బొల్లాను తుడి చేస్తుంది అనుకొందాం... మరి ఆ తర్వాత? ఈ రెండు సంస్థల అధికారం కింద ఉన్న లక్షలమంది ఎటు వెళ్తారు? వారికి ఏ దేశం ఆశ్రయం ఇస్తుంది? ప్రపంచంలో జనసాంద్రత, పేదరికం ఉన్న ప్రదేశాల్లో గాజా ముందు వరుసలో ఉన్నది. శరణార్థుల సమస్య పెరిగితే పశ్చిమాసియాలో అన్ని దేశాలకు ప్రమాదమే. ఈ శిబిరాలనుంచే హింసాత్మక ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తాయి.అందుకే పాలస్తీనా,లెబనాన్‌లోని ప్రజలను ఇతర దేశాలు తమ భూభాగంలోకి రానీయటం లేదు.
కానీ, మున్ముందు అరబ్ దేశాలన్నీ ఒక్కటై ఇజ్రాయెల్ పై దాడి చేస్తే అది ప్రపంచ సమస్యగా మారుతుంది.ఇప్పటికే పర్షియన్‌గల్ఫ్‌లో హౌతీ ఉగ్రవాదులు అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద సమస్యగా మారారు. ఆఫ్రికాలో పదిహేనేళ్ల క్రితం వచ్చిన జాస్మిన్ తిరుగుబా టులో గడాఫీ, సద్దాం హుస్సేన్ వంటివారు అంతమై పోయారు. కానీ, వారి స్థానంలో ఇప్పటికీ బలమైన, స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడలేదు. ఇప్పుడు గాజా, లెబనాన్‌లోనూ ఆదే జరుగుతోంది. వీలైతే హమాస్‌ను, హెజ్బొల్లాను పూర్తిగా నాశ నం చేసి ఇజ్రాయెల్ తన దారిన తాను పోతుంది.
ఒకవేళ మరో ఐదారేండ్ల తర్వాత హమాస్,హెజ్బొల్లా మళ్లీ పుంజుకుంటే ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం చేస్తుందా? అసలైన సమస్యను పరిష్కరించకుండా పైపై పూతలతో ... సమస్యలు సమూలంగా పరిష్కారం కానంతవరకు పగ, ప్రతీకారం అంతమవుతాయా? భవిష్యత్తే నిర్ణయం ప్రకటించాలి. మన దేశంలోనూ ఖలిస్తాన్ ఉద్యమం, కాశ్మీర్‌లో ఉగ్రవాదం, దక్షిణాదిలో నక్సలిజం అంతం అయ్యాయా! వారు లేవనెత్తిన సామాజిక, ఆర్థిక, భూమి సమస్యలు పరిష్కారం కాకుండా... ప్రజల కు విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి లభించకుండా అసమాన సమాజం నుండి పుట్టు కొచ్చిన ఉద్యమాలు అంతరిస్తాయా?
ప్రస్తుతానికి కాలం కలసిరాక స్తబ్దంగా ఉన్నా...సమయం వచ్చినప్పుడు నూతన జీవం పోసుకుంటాయి...ఉద్యమాలు చిగురిస్తాయి, నియంతల భరతం పడతాయి.
వ్యాసకర్త సెల్: 9849328496