calender_icon.png 26 November, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడగొట్టు వాన వదలదాయె.. బర్కత్‌లేని బతుకాయె!

18-05-2024 12:41:32 AM

కల్లాల్లో మళ్లీ తడిసిన ధాన్యం

రాష్ట్రవ్యాప్తంగా రైతుల నిరసనలు, రాస్తారోకోలు

జోరువానకు వరంగల్ నగరం జలమయం

భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో నేలకొరిగిన వరి పైరు

విజయక్రాంతి నెట్‌వర్క్ : తెలంగాణవ్యాప్తంగా గురువారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడింది. చమటోడ్చి పండించిన పంటను నేలమట్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో కొనేందుకు కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో యాదాద్రి, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన మార్గాల్లో బైఠాయించి రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యాన్నీ ప్రభుత్వం కొనాలని, దొడ్డు వడ్లకూ క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.

కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో ధాన్యాన్ని ఎక్కువ కాలం కల్లాల్లోనే ఉంచుతున్నామని, దీంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని వాపోయారు. అలాగే పంట దిగుబడి ఎక్కువగా వచ్చిన ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి వర్షం ధాటికి వరంగల్ నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. జనజీవనం స్తంభించింది. పలుజిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి.

జోరు వాన  హైరానా

వరుస వర్షాలతో రైతుల కలవరం

వరంగల్ నగరం జలమయం

ఇండ్లలోకి చేరిన వరద నీరు

భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో నేలకొరిగిన వరి పైరు

కల్లాల్లో తడిసిన ధాన్యం

జయశంకర్ భూపాలపల్లి/రాజన్న సిరిసిల్ల/ జయశంకర్ భూపాలపల్లి, మే17 (విజయక్రాంతి)/ వరంగల్ తూర్పు:  రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారమూ పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన వరి పంట దెబ్బతింటున్నదని, కల్లాల్లోని ధాన్యం తడిసి రేటు తగ్గుతున్నదని దిగాలు పడుతున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంతోపాటు ధర్మారం జూలపల్లి, కమాన్‌పూర్, ముత్తారం తదితర మండలాల్లో జోరు వాన కురిసింది. పలుచోట్ల కల్లాల్లోని ధాన్యం తడిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. వరుసగా కురుస్తున్న వానలకు కొన్నిచోట్ల వడ్లకు మొలకలు వచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షానికి వందలాది ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. వేములవాడ మండలం ఆరెపల్లిలోని కరీంనగర్ కామారెడ్డి ప్రధానమార్గంలో చెట్టు విరిగిపడడంతో ట్రాఫిక్ జామ్ అయింది.

అధికారులు స్పందించి చెట్టును పక్కకు వేయించడంతో తిరిగి ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది. వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షం కురిసింది. నగర పరిధిలో 6 సెంమీ వర్షపాతం నమోదైంది. సంతోషిమాత కాలనీ, బీఆర్ నగర్, మైసయ్య నగర్, కాశికుంట వంటి లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. కరీమాబాద్, భద్రకాళి ఆలయ మార్గాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. రంగంలోకి దిగిన డీఆర్‌ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నయీంనగర్‌లో నాలా పనులను పరిశీలించారు. ముంపు బాధితులు అత్యవసర సాయం కోసం 1800 425 1980 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

రైతులెవరూ ఆందోళన చెందొద్దు..

* ‘ధాన్యం తడిసిందని రైతులెవ రూ ఆందోళన చెందొద్దు. రైతు లు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొం టుంది. కొన్ని రాజకీయ పార్టీలు కేవలం వారి ప్రయోజనాల కోసమే ఆందోళనలు చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసే కుట్రలో భాగంగానే ధర్నాలు. ధాన్యం కొనుగోలుపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు’ అని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

పది జిల్లాల్లో వర్షం

ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, మే 17(విజయక్రాంతి): ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం నల్లగొండ  జిల్లా కనగల్ మండలంలో 108.9 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్‌లో 41.9 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా గుణేగల్‌లో 19.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నాంపల్లిలోని సర్కిల్ 14లో 72.1 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. గ్రేటర్‌లో ఆదర్శనగర్ సర్కిల్ 25లో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా రాజేంద్రనగర్ సర్కిల్ 11లో 21.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

తిరుమలలో వర్షం 

ద్రోణి ప్రభావంతో తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం పడింది. దీంతో ఆలయ ప్రాంగణమంతా తడిసి ముద్దయ్యింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డు విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్ళేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుమలు తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన షెడ్ల కింద భక్తులు తలదాచుకున్నారు. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు, క్యూ లైన్లన్నీ భక్తులు ఉన్నారు. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.