calender_icon.png 27 January, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగానికి బద్ధులై అభివృద్ధికి పాటుపడదాం...

26-01-2025 06:12:54 PM

సింగరేణి మణుగూరు ఏరియా జిఎం రామచందర్..

మణుగూరు (విజయక్రాంతి): రాజ్యాంగం ద్వారా కల్పించబడిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, బాధ్యతలకు బద్ధులమై దేశ, సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటు పడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు. సింగరేణి మణుగూరు ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏరియా జిఎం రామచందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, సింగరేణి సెక్యూరిటీ విభాగం, ప్రైవేట్ సెక్యూరిటీ విభాగం, వివిధ పాఠశాలల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ.. సంస్థ సి అండ్ ఎం డి ఎన్ బలరాం నాయక్ సారధ్యంలో సంస్థ అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతుందన్నారు. రక్షణ, పర్యావరణ విభాగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకున్న విషయాలను గుర్తు చేశారు.

ఇప్పటికే సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్, జియో థర్మల్ విద్యుత్ విభాగాల్లో మణుగూరు ఏరియా ముందుందన్నారు. బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి సంస్థలో తన రికార్డులను తానే తిరగరాసుకున్న చరిత్ర మణుగూరు ఏరియాకు ఉందన్నారు. 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటికే 96.97 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీసి 95% ఉత్పత్తిని సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 91.98 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయడం జరిగిందని, 81 శాతం ఓబి వెలికితీత పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం వేడుకల్లో పలు ప్రైవేటు పాఠశాలలు, పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, ఫ్యాన్సీ డ్రస్ అలంకరణలో చిన్నారుల ప్రదర్శన ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ఏరియా సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి, ఎస్ఓ టు జిఎం డి శ్యాంసుందర్, ఏజీఎం (సివిల్) వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ వెంకట రామారావు, కెపియుజి ఏజీఎం వీరభద్రరావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరభద్రుడు, ఏఐటీయూసీ నాయకులు రామ్ గోపాల్, ఐఎన్టియుసి నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, సెక్యూరిటీ అధికారి కె శ్రీనివాస్, ఏరియా ఆసుపత్రి డివై సీఎంఓ మేరీ కుమారి, సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్, రామేశ్వరరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.