calender_icon.png 19 November, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమానవీయ కాండను ఆపుదాం

30-07-2024 12:00:00 AM

ఐ.ప్రసాదరావు :

నేడు ‘అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ 

ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు, మాదకద్రవ్యాల చీకటి వాణిజ్యం తర్వాత తక్కువ శ్రమ-, ఎక్కువ రాబడిగా సాగుతున్న ‘మానవ అక్రమ రవాణా’ వ్యాపారం ఇవాళ అతిపెద్ద సమస్యగా మారింది. 2003లోనే సమస్యను గుర్తించిన ఐరాస (ఐక్యరాజ్యసమితి) 2010 నుండి నివారణ చర్యలకు పూనుకొంది. ఏటా జూలై 30న ‘మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని’ జరుపుతున్నారు. బయటికి వెళ్ళిన బాలికలు, మహిళలు, పిల్లలు, యువకులు ఇంటికి రాలేదని, మిస్సింగ్ అయ్యారనే మాటలు తరచూ వింటుంటాం. వారిలో చాలామంది అక్రమ రవాణాకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏ వ్యక్తినైనా తన అనుమతితో లేదా అనుమతి లేకుండా వెట్టిచాకిరి చేయించేం దుకు, డబ్బు ఆశ చూపి బలవంతంగా, మోసపూరితంగా శారీరక ప్రయోజనాల కోసం వాడుకోవడాన్నే ‘మానవ అక్రమ రవాణా’గా పరిగణించాలని ఐరాస తెలిపింది. ఈ బాధితులలో ఎక్కువగా మహిళలు, బాలికలు, పిల్లలు ఉంటున్నారు.

80 శాతం మహిళలే

ప్రపంచవ్యాప్తంగా 2018లో 148 దేశాలనుంచి 50,000 మందికిపైగా అక్రమ రవాణాకు గురైనారు. వీరిలో 50 శాతం లైంగిక దోపిడికి గురవగా, 38 శాతం మందిని బాలకార్మికులుగా మార్చేసారు. 46 శాతం మంది మహిళలు కాగా, 19 శాతం బాలికలని యుఎన్‌ఓడీసీ (యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ క్రైమ్)తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురు బాధితుల్లో ఒక చిన్నారి ఉంటున్నది. ఏటా అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో 6 లక్షల మంది అక్రమ రవాణా అవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

వీరిలో 80 శాతం లైంగిక దోపిడికి గురవుతుండగా, సగం మంది 16 సంవత్సరాల లోపువారు. వీళ్లద్వారా సుమారు 32 బిలియన్ డాలర్ల వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తున్నది. అక్రమ రవాణాలో 80 శాతం మహిళలు ఉంటున్నారని, 55 శాతం మహిళలు, బాలికలు కాగా, 25 శాతం పిల్లలని తెలుస్తున్నది. రెండు నుంచి మూడు కోట్లమంది ఈ బానిసత్వంలో మగ్గుతున్నారు. మన దేశంలోకి కూడా సరిహద్దు ప్రాంతాలనుంచి వేలసంఖ్యలో అక్రమ రవాణా అవుతున్నట్లు ఎన్జీవో సంస్థలు చెబుతున్నాయి. 

భారతదేశంలో 2018లో 5,264 కేసులు నమోదు కాగా, వీరిలో 64 శాతం మంది స్త్రీలు, 18 సంవత్సరాలు నిండనివారు ఉన్నారు. 2018  -2022 మధ్య 10,659 కేసులు నమోదు కాగా, 26,840 మందిని అరెస్టు చేశారు. 2022లో అత్యధికంగా 5,648 మందిపై కేసులు నమోదైనట్లు అప్పటి కేంద్రమంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. ఇక, 2022లో ఆంధ్రప్రదేశ్‌లో 173, తెలంగాణలో 391 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ‘ధ్రువ’ పోర్టల్‌ద్వారా అక్రమ రవాణాపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురిని అమెరికాలోని టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టు చేశారు. అక్రమ రవాణా ఎక్కువగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఏపీ, ఒడిషా తదితర రాష్ట్రాలనుంచి జరుగుతున్నదని, వీరిలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు చెందినవారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. రంగుల కలలు కంటూ కొంతమంది ముక్కు పచ్చలారని బాలికలు, ప్రేమ పెళ్లిళ్ల పేరుతో మరి కొందరు మోసగాళ్ల చేతికి చిక్కి, వ్యభిచార కూపంలోకి జారుతున్నారు. పురుషులు, బాలురు గనులు, ప్రమాదకరమైన పరిశ్రమలు, మాదక ద్రవ్యాల రవాణాలోకి బలవంతపు తోసివేతకు గురవుతున్నారు.

నిస్సహాయత, వలసలు, దళారీల మోసాలు, సరిహద్దులు దాటించటం, అంతర్జాతీయ క్రిమినల్ గ్రూప్స్, వివిధ నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్స్ , అవినీతి అధికారులు, చట్టాలు పటిష్టంగా అమలు కాకపోవడం వంటివి మానవ అక్రమ రవాణా ప్రతీ సంవత్సరం పెరగడానికి ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. వీరిని లైంగిక దోపిడీ, వ్యభిచారం, భిక్షాటన, బలవంతపు వివాహాలు, దత్తతలు, వెట్టిచాకిరి, అవయవాల దోపిడీ వంటివాటి ద్వారా అంతర్జాతీయంగా పెద్ద వ్యాపారమే సాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా బాధితుల్లో  పిల్లలు 12 లక్షలమంది ఉన్నట్లు యునెసెఫ్ తెలిపింది. మానవ అక్రమ రవాణాలో దక్షిణాసియా ప్రాంతం 2వ స్థానంలో ఉంది. అక్రమ రవాణాకు గురైన మహిళలు మానసిక, శారీరక అనారోగ్యాలకు ముఖ్యంగా పీటీఎస్‌డీ, డిప్రెషన్, ఆందోళన, హెచ్‌ఐవీ, క్షయ, ఎస్‌టీడీ వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మూత్రపిండాల మార్పిడిలో 5- శాతం ఈ అక్రమ రవాణా బాధితుల నుండి గ్రహిస్తున్నట్లు తెలుస్తున్నది.

2.1 కోట్ల నిర్బంధ కార్మికులు

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ప్రకారం 2.1 కోట్ల్లమంది నిర్బంధ కార్మికులు (ఫోర్స్‌డ్ లేబర్)గా పనిచేస్తున్నారు. భారతదేశం నుంచి అక్రమ రవాణాకు గురైన మహిళలను మస్కట్, గల్ఫ్, అరబ్ దేశాలకు ఎగుమతి చేసి, వేశ్యావృత్తిలోకి దించుతున్నారు. వీరిలో 20% మంది 16-- వయస్సు గలవారు, 16% మంది 14 సంవత్సరాలు లోపువారని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 150 బిలియన్ల డాలర్ల మేర ఈ అక్రమ రవాణా వ్యాపారం జరుగుతున్నట్లు ఐఎల్‌ఓ తెలిపింది. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడం, 13-- సంవత్సరాల మధ్య వచ్చే శారీరక మార్పులు, తగిన అవగాహన లేకపోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం, చెడు స్నేహాలతో బాలికలు ఆకర్షణలకు గురవటం, ఇంకా ఒంటరి మహిళలు ఆదరణ కోసం వేలసంఖ్యలో మోసం పోతుంటే, పదుల సంఖ్యలోనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ చట్టం కింద కేసులు నమోదు చేయకుండా, ఎక్కువ కేసులు సాధారణ చట్టాల సెక్షన్ల కింద నమోదు చేయటం వల్ల వీరి వెనుక ఉన్న అసలు నేరగాళ్లు తప్పించుకుంటూ, తక్కువ శిక్షలతో బయట పడుతున్నారు. 

చట్టాల అమలులో అలసత్వం

భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ రవాణా నేరం. ఆర్టికల్ 24 ప్రకారం వెట్టిచాకిరి చేయించరాదు. అంతేకాక, 1956 నుండి 2021 మధ్య ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది. కానీ, వాటి అమలులో అలసత్వం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరటం లేదు. మానవ హక్కులు కనుచూపు మేరలో కనపడడం లేదు. సరైన బడ్జెట్ కేటాయింపులు లేనందున బాధితులకు పునరావాసం, రక్షణ కరువవుతున్నాయి. సీబీఐ నివేదిక ప్రకారం 1.20 కోట్లమంది భిక్షగాళ్ళు, వ్యభిచారులు, బాలకార్మికులు, మాదకద్రవ్యాల మాఫియాగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం నుంచి అక్రమ రవాణా ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. సెల్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావటంతో యువత గాడి తప్పుతున్నది. 

తమ పిల్లల ఆలోచనలు, దైనందిన కార్యక్రమాలపై కుటుంబసభ్యులు నిఘా ఉంచాలి. అక్రమ రవాణాలో చిక్కుకున్న బాధితుల పరిస్థితి, వారి హక్కులు, రక్షణ నిమిత్తం ఈ దినోత్సవం ప్రాధాన్యతను గుర్తించాలి. చైల్డ్ లైన్, పోలీసు హెల్ప్‌లైన్, దిశ యాప్, మహిళా పోలీస్, నిర్భయ, పోక్సో చట్టాలద్వారా రక్షణ భద్రత పొందాలి. జువైనల్ జస్టిస్ చట్టం, ఐటీ, ఇమ్మోరల్ ట్రాఫికింగ్, బాలకార్మిక నిర్మూలన చట్టాలు పకడ్బందీగా అమలు జరపాలి. జాతీయ స్థాయినుంచి జిల్లా స్థాయివరకూ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు మరింత చురుగ్గా పనిచేయాలని ఆశిద్దాం. షాహీన్, ప్రజ్వల, మై ఛాయిస్, రెడ్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా బాధితుల కన్నీటి వెతలు, శారీరక మానసిక గాయాలు చివరికి వారిని జీవచ్ఛవాలుగా మారుస్తూ, జీవితాలను, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీని నిర్మూలనకు ప్రభుత్వాలు కంకణబద్ధం కావాల్సి ఉంది.

 వ్యాసకర్త సెల్: 9948272919