నిజమే, సంగీతం ఎంతో మధురమైంది. ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో చెప్పలేనిది. రాగం, తానం, పల్లవి. ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. సప్తస్వరాలే సంగీత ప్రపంచానికి మూలాధారాలుగా నిలుస్తున్నాయి. కాలా న్ని సైతం మరిపించి మానసిక ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే ఉందనడంలో అతిశయోక్తి లేదు. మనిషి మనసును కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. మనసుకు నచ్చిన పాట లేదా మనసును హత్తుకునే సంగీతం విన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది.
ఎప్పుడైనా ఒత్తిడికి లోనైనట్లు అనిపించినప్పుడు ఒక మంచి పాట,, వీనుల విందైన సంగీతం వింటే ఎంతో సాంత్వన లభిస్తుంది. పొత్తిళ్ళలోని పాపాయి ‘ఉంగా ఉంగా’ అని చేసే శబ్దంలో ఉంది సంగీతం. తల్లి తన బిడ్డను ఊయల లూపుతూ పాడే లాలి పాటల్లో ఉంది సంగీతం. శ్రమైక జీవులు తమకు అలుపు తెలీకుండా పాడుకునే పాటల్లో ఉంది సంగీతం. జూన్ 21న జరుపుకొన్న ‘సంగీత దినోత్సవం’ మొదటిసారిగా ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. ఆ రోజును ‘మ్యూజిక్ డే’ లేదా ‘అంతర్జాతీయ సంగీత దినోత్సవం’గా జరుపుకుంటున్నాం.
భారతదేశం సంగీత దేశం. అలనాటి అన్నమయ్య, త్యాగరాజులను సంగీత విధ్వాంసులు, కళాకారులు మరచిపోలేరు. ప్రముఖ గాయకుడు ఘంటసాలకు ప్రపంచస్థాయిలో పేరు వచ్చిందంటే ఆ గొప్పతనం సంగీతానిదే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, ఆఖరికి పశువులు, జంతువులు సైతం సంగీతానికి ముగ్ధులవ్వక తప్పదు. భక్త రామదాసు భజన సాంప్రదాయం, కబీర్‌దాస్ రామచరిత్ మానస్, ముత్తుస్వామి దీక్షితులు నవవర్ణ కీర్తనలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలు, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత రాగాలు.. ఇంకా అనేక మంది లబ్దప్రతిష్టులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన భారతీయ సంగీతం అజరామరం.
మనసుకు ఉల్లాసాన్ని అందించే సంగీతానికి పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరు స్పందిస్తారు. సంగీతం ప్రాంతాల వారిగా ప్రత్యేకతను చాటుకుంది. మన సంగీతాన్ని ప్రధానంగా మూడు విభాగాల్లో చూడవచ్చు. శాస్త్రీయ సంగీతం, జానపదం, ఆధునిక సంగీతం. శాస్త్రీయ సంగీతంలో ఉత్తరాదికి చెందిన హిందుస్థానీ సంగీతం, దక్షిణాదికి చెందిన కర్ణాటక సంగీతం ఉన్నాయి. జానపద సంగీతం ప్రధానంగా ఆయా ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబింప చేస్తాయి. కాలం మారింది, కాలంతోపాటు సంగీతంలో కూడా కొత్తదనం వచ్చింది. స్వరాలు ఏడు అయినా రాగాలు ఎన్నెన్నో అన్నట్లు సంగీతంలోనూ అనేక కొత్త ఒరవడులు వచ్చాయి.
పాలపర్తి సంధ్యారాణి