29-03-2025 10:18:24 PM
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న చేపడుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన యూనియన్ జిల్లా స్థాయి సమ్మె వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా సవరణలు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకువచ్చిందన్నారు.
దేశ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక ద్రోహానికి పాల్పడిండిందని పేర్కొన్నారు. మరోవైపు ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో వాటాలను విక్రయిస్తూ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, ఉపాధ్యక్షులు మల్లేష్, లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.