calender_icon.png 19 November, 2024 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమెరా కళ్లను కాపాడుకుందాం!

29-06-2024 12:00:00 AM

గత స్మృతులను నెమరు వేసుకోవడం కెమెరాతో అందంగా సాధ్యమవుతుంది. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క కెమెరా ఫొటోతో చెప్పొ చ్చు. ఎన్నో భావాలను ఒక్క చిత్రంతో తెలిపే గొప్పదనం కెమెరాకి ఉంది. ఆధునిక కాలంలో మానవ జీవితంతో  విడదీయలేని బంధం ఈ యంత్రానిది. కెమెరాకు శతాబ్దాల చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో పారిస్‌లో నలుపు తెలుపులతో ప్రారంభమైన ఛాయాచిత్రం కాలక్రమంలో రంగులు అద్దుకుంటూ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ సాంకేతిక విప్లవం ఫలితంగా ఇప్పుడు సెల్‌ఫోన్లలోనూ కెమెరాలు ఒదిగిపోతున్నాయి. 

మన దేశంలో 1857 వరకు కూడా ఫొటోగ్రఫీ అందుబాటులోకి రాలే దు. కేవలం బ్రిటీష్ అధికారులు, జమిందారులు, సిపాయిలు మాత్రమే దీన్ని ఉపయోగించే వారు. 1877 నుంచి ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో మొట్టమొదటిసారిగా లాలా దీనదయాళ్ ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. ఫొటోగ్రఫీకి ప్రాణమైన కెమెరాలు మొదట్లో చాలా పెద్దసైజులో ఉండేవి. మొదట్లో ఎయిమ్ ఆండ్ షూట్ కెమెరాలు వాడుకలో ఉండేవి. 2010 నాటికి దాదాపు అన్ని మొబైల్ ఫోన్‌లు 1, 2 మెగా పిక్సెల్ డిజిటల్ వీడియో కెమెరాలను కలిగి వున్నాయి.

ఇవి ఆకారంలో పెద్దగా ఉన్నా కొద్ది దూరంలోని వస్తువులనే కెమెరాలో బంధించగలిగేవి. తర్వాత ఫీల్ కెమెరాలు వచ్చాయి. ఇవే నల్లగుడ్డతో ముసుగు వేసుకొని ఫొటో తీసే కెమెరాలు. కేవలం రెండు ఫిల్ములు మాత్రమే ఉండి, అవి కూడా పలకలంత సైజులో ఉండటం వల్ల రెండు ఫొటోలు మాత్రమే తీసేందుకు వీలుండేది. దీనివల్ల మోతబరువు తప్ప ఫొటోల నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఆ తర్వాత టీఎల్‌ఆర్ (ట్వి న్లెన్స్ రిఫ్లెక్టర్) కెమెరాలు వచ్చాయి. మెడలో కెమెరా వేసుకొని కిందికి చూస్తూ ఫొటోలు తీసేవారు. డిజిటల్ కెమెరాల రాకతో ఫొటోగ్రఫీ నిర్వచనమే మారిపోయింది. 

చిన్న సైజు మెమొరీ కార్డుతో వందలాదిగా, స్పష్టమైన రంగుల్లో అద్భుతమైన ఫొటోలు తీసే నైపుణ్యం అందరికీ అందుబాటులోకి వచ్చింది. వైడ్, టెలి లెన్స్ రెండింటికీ డిజిటల్ టెక్నాలజీ జోడించి ఛాయాచిత్రాలను నిమిషాల్లో అందజేసేందుకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. డ్రోన్ కెమరాలు విరివిగా ఉపయోగిస్తూ చిత్రాలు తీస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక ఫొటో స్టూడియోకి వెళ్లి కెమెరాతో  ఫొటోలు దిగడం తగ్గింది. ఈ రంగం మీద ఆధారపడిన వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 

 కామిడి సతీష్ రెడ్డి