03-03-2025 11:48:49 PM
వరల్డ్ హియరింగ్ దినోత్సవంలో మంత్రి కొండా సురేఖ...
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): వినికిడి సమస్యను సాంకేతికతతో అధిగమిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్ లోని మా ఇ.ఎన్.టి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పోస్టర్ ను ఆవిష్కరించి, శస్త్ర చికిత్సను విజయవంతం చేసుకున్న చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం వైద్యులను సత్కరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ... వినికిడి లోపానికి గల అనేక కారణాలను సరైన జాగ్రత్తతో నివారించవచ్చని చెప్పారు.
వినికిడి లోపం ఉన్నవారికి సకాలంలో, తగిన మేరకు చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయవచ్చన్నారు. సరైన చర్యలు తీసుకుంటే బాల్యంలో కనీసం 60శాతం వినికిడి లోపాన్ని నివారించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టారనీ గుర్తు చేశారు. ఈ ఎన్‌టీ సమస్యలను ఆరోగ్యశ్రీలో అందుబాటులోకి తీసుకురావాలన్ని సీఎం వద్ద ప్రస్తావిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా ఈఎన్టీ గ్రూప్ చైర్‌పర్సన్ సునీత కుమార్ ఆసుపత్రి ఎండీ మేఘనాథ్, ఈఎన్టీ ఆసుప్రతి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.