15-04-2025 10:49:33 PM
న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్వరరావు పిలుపు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో పెంకు కార్మికుల సంఘాన్ని స్థాపించి వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషిచేసి, న్యూ డెమోక్రసీ పార్టీలను ఒకే పార్టీగా విలీనం చేయడంలో న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత ముక్తార్ పాషా చేసిన కృషి అమోఘమని, ముక్తార్ పాషా చూపిన మార్గంలో ముందుకు సాగాలని న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
దివంగత ముక్తార్ పాషా జ్ఞాపకార్థం మహబూబాబాద్ జిల్లా కొత్తపేట వద్ద నిర్మించిన స్మారక స్థూపాన్ని వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, న్యూ డెమోక్రసీ నేతలు హాజరై ముక్తార్ పాషా స్మారక స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌని ఐలయ్య, ఆవు నూరి మధు, గోవర్ధన్, పిఓ డబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్య, మండల వెంకన్న, తుడుం వీరభద్రం, అనురాధ, సీతారామయ్య, బండారి ఐలయ్య, మోకాళ్ళ మురళీకృష్ణ, నందగిరి వెంకటేశ్వర్లు, పర్వత కోటేష్, శివారపు శ్రీధర్, హెచ్.లింగ్యా తదితరులు పాల్గొన్నారు.