calender_icon.png 6 November, 2024 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటకాన్ని బతికించుకుందాం!

22-04-2024 12:15:00 AM

జగ్రాహ్య సాధ్యం రుగ్వేదాద్ 

సామజ్యోగీతమేవచ

యజుర్వేదాదభి నయాన్

రసాన్ అధర్వణాదపి

అని రుగ్వేదం నుంచి సాహిత్యం అనగా మాటలు, పాటలు, పద్యాలు లాంటివి. సామవేదం నుంచి సంగీతం, గానం, నేపథ్య సంగీతం లాంటివి.. యజుర్వేదం నుంచి అభినయం అనగా చతుర్విధాభినయం అనగా ఆహార్యం, ఆంగీకం, వాచికం, సాత్వికాలు, అధర్వణ వేదం నుంచి నవరసాలు గ్రహించి విలసిల్లిందే నాటకం. కనుకనే ఇది పంచమ వేదమయింది. సర్వ లలిత కళల సమాహార స్వరూపమే నాటకం. లలిత కళలలో ఒకటైన సాహిత్యం నాటకంలో వచనాలుగా, పాటలుగా, పద్యాలుగా విలసిల్లితే, సంగీతం వాటికి ఆలంబనగా, నేపథ్యంగా భాసిల్లింది. నృత్యం నాటకంలోని నాట్యాలుగా, అభినయాలుగా రూపొందింది. చిత్రలేఖనం రంగస్థలంపై తెరలుగా దృశ్యాలుగా కనిపిస్తుంది.

శిల్పం నటీనటుల ఆహార్యంగా భాసిల్లి వారిని వివిధ పాత్రల శిల్పాలుగా రూపొందించింది. ఇలా లలిత కళల సమాహారమైంది నాటకం. కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతాహి సాహిత్యం అని ఆలంకారికులచే కొనియాడబడింది నాటకం. సామాజిక సమస్యలకద్దంపట్టి వాటికి పరిష్కారమార్గాలు నిర్దేశిస్తూ నిద్రిస్తున్న సమాజాన్ని తట్టి మేల్కొని చైతన్యవంతం చేసి ముందుకు నడిపించగలిగింది నాటకం. కళాకారులు కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి చైతన్యమనే వెలుగు ప్రసాదించేది నాటకం. నటీనటులు కష్టనష్టాలు భరిస్తూ సామాజికులకు రసానుభూతిని కలిగించేది నాటకం.

రచయిత, దర్శకుడు, ప్రయోక్త, నిర్మాత, నటీనటులు, సంగీతజ్ఞులు, ఆహార్యం, రంగోద్దీపన, దృశ్యబంధ నిర్మాణం మొదలైన సాంకేతిక కళాకారులు మొదలగు వారందరూ కలిసి పరిశ్రమిస్తే నాటకం రూపొందుతుంది. ఆ తర్వాత రంగశాల, ప్రేక్షకులు, ఆర్థిక సహకారం అందితే ప్రదర్శింపబడుతుంది. ఒక నాటక ప్రదర్శనకు ఇంత శ్రమ, ఎంతో ఖర్చు, ఓర్పు, నేర్పు, ప్రదర్శనా పఠిమ, ప్రేక్షకాదరణ, ప్రోత్సాహాలు కావాలి. స్థూలంగా నాటకం ఇలాగుంటుంది. 

ఆధునిక కాలంలో నాటక ప్రయోక్తలు స్టాన్స్లవిస్కీ మొదలైన పాశ్చాత్య నాటక ప్రయోక్తలనే ఆధారంగా తీసుకుంటున్నారు. రంగస్థల శాఖలు వాటినే సిలబస్‌గా ఉపయోగిస్తున్నారు. కానీ, పాశ్చాత్యులు కళ్లు తెరవక ముందే భారతదేశంలో నాటకం పుట్టింది. నాట్యశాస్త్రం పరిఢవిల్లింది. భరతముని నాట్యశాస్త్రం, నందికేశుని అభినయ దర్పణం మొదలైన నాటక శాస్త్ర గ్రంథాలు ఆవిష్కృతమైనాయి. శివపార్వతుల నాట్యయుతాభినయమ్ తొలి నృత్యనాటకంగా వెలిసిందని ఆలంకారికుల అభిప్రాయం. ఇది నంది ద్వారా మునులకు, మునుల ద్వారా సకల లోకాలకు పరివ్యాప్తమైనదని విమర్శకుల అభిప్రాయం. నాట్య శాస్త్రంలో, ‘దశరూపకాలు’లో, ‘అభినయ దర్పణం’లో చెప్పిన నాటక లక్షణాలు, అభినయ లక్షణాలు చూస్తే పాశ్చాత్య నియమాలు, లక్షణాల కన్నా చాలా లోతుగా విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. ఇవి పాశ్చాత్య నాటక లక్షణకర్తల కన్నా వందల సంవత్సరాల ముందే ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని కూడా థియేటర్ ఆర్ట్స్ బోధనలో ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

రంగశాలల విషయానికొస్తే పాశ్చాత్య రంగశాలలకన్నా ఎంతో ముందే భారతదేశంలో రంగశాలలు విలసిల్లాయి. వారి లెక్క ప్రకారమే 1848లో కర్నల్ ఓస్లీ మధ్యప్రదేశ్‌లో రాంఘీర్ పర్వతాల మధ్య సీతాచొంగారా, జోగిమారా గుహలను తొలిచి పెద్దహాలులా రంగశాలలేర్పరిచారు. 1904లో డాక్టర్ బ్లీచ్ అనే జర్మన్ పండితుడు ఈ రంగశాలలో జానపద నాటకాలు వేసేవారని తెలిపాడు. ఈ విషయాలు మధ్యప్రదేశ్‌కు చెందిన కుంతల్ గోయెల్ అనే మేధావి సందేశ్ అనే పత్రికలో రాశారు. ఈ గుహలు, రంగశాలలు మౌర్యులకు పూర్వం నాటి లోమేష్ గుహలను పోలియున్నాయని తెలిపాడు. ఇవేగాక ఆలయాలు, బౌద్ధారామాలు, చైత్యాలు, గుహలు నాటక రంగశాలలయ్యాయి.ఈ జోగిమారా రంగశాల 30x15 అడుగుల కొలతలతో ఉంటుంది. ఇది భరతముని నాట్యశాస్త్రానికి ఉదాహరణగా చెప్పవచ్చు. యవనిక అన్న భరతముని పదప్రయోగాన్ని నెట్టౌసి అనే గ్రీకు భాషా పదమని నేటి వారు చెబుతున్నారు.

ఇలాంటిదే కాళిదాసును ‘ఇండియన్ షేక్స్‌పియర్’ అనడం వల్ల నాల్గవ శతాబ్దికి చెందిన కాళిదాసు ఎక్కడ? 16వ శతాబ్దికి చెందిన షేక్స్‌పియర్ ఎక్కడ? ఈ విధంగా ముందున్న చెవుల కన్నా వెనుకవచ్చిన కొమ్ములెక్కువ అన్నట్లు ఏనాడో వేళ్లూనికొని విస్తృతమైన భారతీయ నాటకరంగాన్ని నేడు పాశ్చాత్య నాటకరంగ ప్రభావం ఆక్రమించుకోవటం విచారించదగ్గది. వివిధ దేశాల నాటకరీతులు తెలుసుకోవద్దని గానీ, ఆచరించవద్దని గానీ కాదు కానీ ఆ ఆచరణ మన నాటకరంగాన్ని పరిపుష్టం చేయాలనే గాని మన నాటకరంగాన్ని చిన్న చూపు చూసి అదే ఔన్నత్యమనే స్థాయిలోకి పోకూడదు. ఎన్నటికీ భారతీయ నాటకరంగం ప్రపంచంలోనే ఉత్తమమైనది. 

తెలుగు నాటకరంగ విషయానికికొస్తే తెలుగులో 1960లో శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు రాసిన మంజరీ మధుకరీయం తొలి తెలుగు నాటకం. అదే ప్రబంధ పద్ధతిలోవ్రాసిన మొదటి పద్య నాటకం, తర్వాత వావిలాల వాసుదేవశాస్త్రి గారు రాసిన నందకరాజ్యం స్వతంత్ర సాంఘిక నాటకం ఇదీ తేటగీత పద్యాలలోనే రాయబడింది. ఇది తొలి సాంఘిక పద్య నాటకం. 1880-- ప్రాంతాలలో ధార్వాడ నాటక సమాజం వారొచ్చి తెలుగు జిల్లాల్లో సంచరించి హిందీ నాటకాలు ప్రదర్శించారు. దార్వాడ వారు  తాటాకుల పాకలలో నాటకాలు ప్రదర్శింపజేశారు. తర్వాత శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ‘రత్నావళి’ నాటకం గద్య, పద్యాత్మకంగా రాసి ప్రదర్శింపజేశారు. అభిజ్ఞ శాకుంతలం రాసి దాన్ని అలాగే ప్రదర్శించారు. ఆ తర్వాత సర్వశ్రీ కొండుసెట్ల సుబ్రమణ్య శాస్త్రిగారు, వడ్డాది సుబ్బరాయ కవిగారు, నాదేళ్ల పురుషోత్తం గారు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు, చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు, వేదం వేంకటరాయశాస్త్రిగారు, పానుగంటి లక్ష్మీనరసింహ రావు గారు, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు, తిరుపతి వేంకట కవులు తదితర లబ్దప్రతిష్ఠులైన కవులు అనేక నాటకాలు రాసి ప్రదర్శించి తెలుగు నాటకరంగాన్ని పరిపుష్ఠం చేశారు. 

1920 తర్వాత మహాత్మాగాంధీ జాతియోద్యమంలో దామరాజు పుండరీకాక్షుడు స్వరాజ్య సోపానం,  సోమరాజు రామానుజరావు  స్వరాజ్య రథం, తిలక్ రాయభారం దేశభక్తి నాటకాలు సాంఘిక నాటకాలుగా వెలిశాయి. గురజాడ కన్యాశుల్కం, కాళ్లకూరి వరవిక్రయం, చింతామణి మొదలైన నాటకాలు వెల్లివిరిశాయి. ఇలా ఎందరెందరో నాటకాలు రాయడం అనేక సంస్థలు వేయడం జరిగాయి. ఈ కాలంలోనే తెలుగు నాటక రంగానికి సురభి కుటుంబ నాటక రంగం వనారస గోవిందరావుతో మొదలై విశేష సేవ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని పద్యనాటకాలు ఉర్రూతలుగిస్తున్న సమయంలోనే తెలంగాణలో కెఎల్. నరసింహారావు, షబ్నవీసు వెంకటనరసింహారావు, మంత్రి శ్రీనివాసరావు, ఒద్దిరాజు సోదరులు, కవి రాజమూర్తి  వంటివారు సాంఘిక నాటకాల పంటవం ఉంచారు. -సాంప్రదాయ నాటకాల ప్రార్థనాగీతం - పరబ్రహ్మ పరమేశ్వర... శ్రీ చందాల కేశవదాసు గారు రాయగా శ్రీ పాపట్ల లక్ష్మీకాంతయ్యగారు స్వరపరిచారు. నేటికి అదే ప్రార్థనా గీతం పద్య నాటకాల వారు పాడుతుంటారు. తర్వాత జననాట్య మండలి ప్రజానాట్య మండలి వంటి సంస్థలు నిజాం పాలనకు, రజాకార్లకు, దొరలకు వ్యతిరేకంగా నాటకాలు రాయించి  ప్రదర్శించారు.

‘జన సాహితీ’ వారూ అలానే 1981 ‘అప్పు అప్పు అప్పు’ పరిపాలనా చక్రం, కాకుల్ని తరిమిన కుందేళ్లు మొదలైనవి 1982లో ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి పెద్దబాలశిక్ష మొదలైనవి, విప్లవ సంఘం ‘రాజకీయ కబడ్డీ’ మొదలైన ప్రదర్శనలు జరిగాయి. తనికెళ్ల భరణి గోగ్రహణం, డిఎస్‌ఎన్ మూర్తి ‘మహానగరం’ సఫ్దర్ హష్మీ పిదప 1990 నుంచి సఫ్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ ఏర్పడి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భువనగిరి మొదలైన చోట్ల ప్రదర్శనలిచ్చారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో అనేకమంది ఆధునిక నాటక రచయితలు వందలాది నాటకాలు, నాటికలు రాసి ప్రదర్శింపజేశారు. 

రిపర్టరీ నాటకాలు

అబ్బూరి రామకృష్ణారావు, భక్షి శ్రీరాం, కె. ప్రసాదరావు, మంత్రి శ్రీనివాస రావు, హెచ్‌యు. శర్మ, ఏఆర్. కృష్ణ, ఏ. గోపాలకృష్ణ, దెంచనాల శ్రీనివాస్ మొదలగువారు శిక్షణాశిబిరాల ద్వారా అనేక నాటకాలు తయారు చేసి ప్రదర్శించారు. ఈ విధంగా తెలుగు నాటకరంగం సుసంపన్నమైన తర్వాత రాష్ట్ర నాటక రంగం తిరోగమనానికి గురైనది. అప్పుడు నాటకాన్ని జీవింప చేయడానికి ఉద్యుక్తమైనవి పరిషత్‌లు. 1950లో ఆంధ్రప్రదేశ్ నాటక సంఘం ఏర్పాటు జాతీయ నాటక దినోత్సవం నిర్వహించారు. 1955లో నాటక పోటీలు నిర్వహించారు. దీనిని ఆదర్శంగా తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిషత్తులు వెలసి నాటక పోటీలు, పద్య నాటక పోటీలు నిర్వహించసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం 1999 నుంచి నంది నాటక పోటీలు నిర్వహించ సాగింది. దీనిలో ఇటు పద్య నాటకరంగం అటు సాంఘిక నాటకరంగంగా విస్తృతమైంది. నటన, గానం, ఆహార్యాల సెట్టింగ్స్, లైటింగ్స్, సౌండ్ సిస్టం మొదలైన అనేక రంగాలలో నాటకం అభివృద్ధి సాధించింది. ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన వరకు సాఫీగా సాగిన తర్వాత తెలంగాణలో ఆగిపోయాయి.

ఆంధ్రాలో 2017 వరకు కొనసాగి అక్కడా అగిపోయింది. ఈ మధ్యలో 2023లో ఆంధ్రాలో పునః ప్రారంభింపపడింది. తెలంగాణలో థియేటర్ అవార్డ్స్ కమిటీ ఏర్పాడి నియమ నిబంధనలు తయారుచేసినా ఇంకా ప్రారంభింపబడలేదు. కొత్త ప్రభుత్వమైనా ప్రారంభించాలని అభిలాష. ప్రస్తుతం నాటకం తయారు కావడానికి చాలా వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తున్నది. రచయితలు తమ రచనలకు విరివిగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఒకరిద్దరు ఫ్రీగా ఇస్తున్నారు అనుకోండి. దర్శకులకు డబ్బులు ఇవ్వాలి. కొందరు నటులకూ డబ్బులివ్వాలి. నటీమణుల సంగతి సరే సరి. ఆహార్యానికి వారు అధికంగా డబ్బులు అడుగుతున్నారు. సెట్టింగ్‌లు, లైటింగ్‌లకూ అధిక డబ్బే. హర్మోనిస్ట్‌లు, తబలిస్ట్‌లు, కీబోర్డు, క్లారినేట్ మొదలైన పద్య, నేపథ్య, సంగీతానికి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చవుతుంది.

ఎంతలేదన్నా పద్య నాటకం తయారీకి సుమారు లక్ష రూపాయలు, సాంఘిక నాటకారంగం తయారు కావడానికి మినిమం ఖర్చవుతుంది. ఇక ప్రదర్శనకు సెట్టిగ్‌లు, లైటింగ్ మంచి ఆహార్యంలతో వేయాలంటే పద్య నాటకానికి 70 నుంచి 80 వేలు, సాంఘికానికి 40 నుంచి 50 వేలు, నాటికకు 20 నుంచి 30 వేలు ఖర్చు వస్తుంది. పూర్వం లాగా స్పాన్సర్లు ప్రస్తుతం లభించడం లేదు. ప్రభుత్వం తరఫున భాషా సాంస్కృతిక శాఖలు కొంత మొత్తం సహకారం చేసినా అది ఏమాత్రం చాలడం లేదు. అందరికీ అందడం లేదు. కనుక ప్రస్తుతం నాటకరంగం పురోగమించాలంటే ప్రభుత్వాలు, సాంస్కృతికశాఖ, ఎఫ్‌డీసీ, సంగీత నాటక అకాడమీలు పూర్తి సహకారాన్ని అందివ్వాలి. ప్రొడక్షన్ గ్రాంట్లు, ప్రదర్శనా పారితోషకాలు మరియు నాటకాలు ఎక్విప్మెంట్స్ సహాయం అందించాలి.

పోటీలు నిర్వహించే పరిషత్‌లకు అధిక హార్ధిక సహకారం అందించాలి. తమ జీవనోపాధికి కొంత విరామం ఇచ్చిన కళాకారులకు, పేద కళాకారులకు ప్రభుత్వం తగిన విధంగా పెన్షన్లు, ఆర్థిక సహకారాలు అందివ్వాలి. నాటకారంగానికి వారు చేసిన సేవను గుర్తించాలి. పల్లెలు, పట్టణాల్లో మండలాల్లో జిల్లాల్లో నాటకోత్సవాలను ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించి నాటకరంగాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి గుర్తించాలి. దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, శ్రీరామనవమి, గణేశ్ నవమి, ఉగాది, సంక్రాంతి వంటి పర్వదినాల సందర్భంగా విరివిగా నాటకాలు పెట్టించి ప్రోత్సహించాలి. కళలు వర్ధిల్లుతున్న రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది అన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరుగాలి.

తడకమళ్ళ రాంచందర్‌రావు


వ్యాసకర్త : వ్యవస్థాపక అధ్యక్షుడు,

తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య.