calender_icon.png 24 October, 2024 | 6:47 AM

వారిలో ఏ ఒక్కరినీ చేజార్చుకోం

24-10-2024 02:23:26 AM

  1. జీవన్‌రెడ్డి విమర్శలు ఆయన వ్యక్తిగతమే
  2. సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీలో పూర్తి మద్దతు 
  3. ఈటల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు 
  4.  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఏ ఒక్కరనీ కూడా చేజార్చుకోబోమని, అందుకోసం ప్రత్యేకమైన మెకానిజం సిద్ధం చేస్తున్నట్లు  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఏ విమర్శలు చేసినా అవి ఆయన వ్యక్తిగత మన్నారు.

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను పార్టీ గౌరవించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అందరితో చర్చించిన తర్వాతనే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరిన అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ పైవిధంగా స్పందించారు.

జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య దురదృష్టకరమని, ఆయన జీవన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే కాంగ్రెస్ ప్రభుత్వా నికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు చేరిన నియోజక వర్గాల్లో అక్కడక్కడా కొందరు సీనియర్లు ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవమని, వీటన్నింటిపైనా చర్చించి అందరిని సమన్వయం చేస్తామని తెలిపారు. 

 సీఎం రేవంత్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు..

సీఎం కుర్చీ నుంచి రేవంత్‌రెడ్డిని దించేందుకే కాంగ్రెస్ పార్టీ కావాలనే మత కలహాలను సృష్టిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు  ఖండించారు. పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేశారు. సీఎంను దింపేందుకు ఇలా చేస్తున్నారని మాట్లాడేందుకు మీరెవరని ఈటలను  ప్రశ్నించారు.

బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వామపక్ష భావజాలంతో ఉండి బీజేపీలోకి వెళ్లిన రాజేందర్  తమ పార్టీపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నేరవెరాయో పీఎం మోదీని నిలదీయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కు ఏ ఇబ్బంది లేదని, హత్యా రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు.

ఏ పార్టీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని ఆకాంక్షించారు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్థం ఉండాలని, మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలను కోవడం అవివేకమని  దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళన చేయాలా వద్దో  సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్  సురక్షితంగా ఉండాలన్నదే తమ  ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. 

 రైతులకు శాపంగా ధరణి పోర్టల్.. 

 ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని, ఆ పోర్టల్ ఒక సమస్యల పుట్ట అని మహేశ్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ధరణిని సదుద్దేశంతో తీసుకొచ్చారని అనుకున్నామని, కానీ దాని నిర్వహణ ఊరు పేరులేని సంస్థలకు అప్పగించారని, దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

గత ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించిన సంస్థలతో కేటీఆర్, హరీశ్‌రావుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ల్యాండ్ రికార్డు మేనేజ్‌మెంట్ లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేషన్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ( ఎన్‌ఐసీ)కి ధరణి బాధ్యతల అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 

మూసీ డీపీఆర్ కోసం 141 కోట్లు  

మూసీ పునర్జీవనం కార్యక్రమానికి ప్రభు త్వం వెచ్చించబోయే బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు. మూసీ ప్రాజెక్టుకు అవసరమైన డీపీఆర్‌లు సిద్ధం చేసే బాధ్యతను ప్రపంచంలోనే పేరెన్ని క కలిగిన ఐదు సంస్థలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని తెలిపారు.

డీపీఆర్ కోసం రూ. 141 కోట్లు కేటాయించామని, ఆ ఐదు కంపెనీలు కలిసి కట్టుగా మూసినదికి సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి డీపీఆర్ ఇస్తాయన్నారు. నది పునర్జీవనం ఎలా చేయాలి? అందుకు అయ్యే నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలనే అంశాలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తాయని  తెలిపా రు.

సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం 18 నెలల గడువు విధించిందని, ఆ సంస్థలు ఇచ్చే నివేదిక ఆధారంగా మూసీ పునర్జీవ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడు తుందని వివరించారు. కానీ ప్రతిపక్షా లు ఈ మూసీ ప్రాజెక్టుకు   లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతాయంటూ రాద్ధాంతం చేయడంలో అర్థం లేదన్నా రు. ఏదో సంఖ్యను చెప్పుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయడం సరికాదని హితవుపలికారు.