calender_icon.png 20 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు గుంజుకోం

20-11-2024 01:41:36 AM

  1. రైతులను ఒప్పించే భూసేకరణ చేస్తున్నాం 
  2. అసైన్డ్ భూములు గుంజుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌ది
  3. రాజకీయ లబ్ధికోసమే లగచర్లలో రైతులను రెచ్చగొట్టారు 
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం 

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రైతుల భూములను బలవంతంగా గుంజుకుని వేలం వేసి పైశాచిక ఆనందం పొందిన బీఆర్‌ఎస్ రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు, వేదాలు వల్లించినట్టు ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తమ ప్రభుత్వం బలవంతంగా భూములు గుంజుకోదని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉంటే.. బీఆర్‌ఎస్ లగచర్లలో హింసను ప్రేరేపించి దాడులకు పురిగొల్పుతున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. గాంధీభవన్‌లో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రు లు గీతారెడ్డి, దానం నాగేందర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు.

ఇందిరాగాంధీ ఆలోచనలతో తమ ప్రభుత్వం ముందుకె ళ్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు పేదలకు 24 లక్షల ఎకరాల భూములను అసైన్ చేస్తే.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 10 వేల ఎకరాలకు పైగా భూములను రైతులను నుంచి బలవంతంగా గుంజుకుని లేఅవుట్ చేసి అమ్ముకున్నదని ధ్వజమెత్తారు.

రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టే ప్రతీ పనికి ప్రజలను, రైతులను ఒప్పించిన తర్వాతే తమ ప్రభుత్వం భూములను సేకరిస్తోందని ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్ మాత్రం రాజకీయ లబ్ధికోసం లగచర్లలో అమాయక రైతులను రెచ్చగొట్టి కుట్రపూరితంగా దాడి చేయించారని విరుచుకుపడ్డారు.  

ఇందిర చరిత్రను వక్రీకరిస్తున్నారు 

దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన ఇందిరాగాంధీ జీవిత చరిత్రపై అవగాహన కలిగిన వాళ్లు చేతులెత్తి నమస్కరిస్తున్నారని.. దేశాన్ని అస్థిరపరిచి, విభజించాలనుకునేవాళ్లు ఆమె చరిత్రను వక్రీకరిస్తున్నారని భట్టి మండిపడ్డారు. దేశ ప్రజలందరికీ సమానత్వం కల్పించాలని, భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమాజానికి పునాదులు వేశారని కొనియాడారు.

తన ప్రాణం కంటే దేశమే ముఖ్యమని, ఈ దేశ సుస్థిరత కోసం చివరి రక్తపు బొట్టు ఉపయోగపడుతుందని చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని అన్నారు. దేశ చరిత్రపై అవగాహన లేనివాళ్లు, ఇందిర చరిత్రను వక్రీకరించేలా సినిమాలు తీస్తున్నారని మండిపడ్డారు. 

శాస్త్రీయంగా  కులగణన  

ఇందిర స్ఫూర్తితోనే రాహుల్‌గాంధీ దేశంలో కులగణన జరగాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన సర్వేను ప్రారంభించామని భట్టి స్పష్టంచేశారు. రాష్ట్రంలో కులగణన నిబద్ధతతో, శాస్త్రీయంగా జరుగుతోందని, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే దోహదపడుతోందని పేర్కొన్నారు.

కులగణన తర్వాత ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉండబోతుందని చెప్పారు. ఇందిరమ్మ ఆదర్శంగా తమ ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవిస్తుందని అన్నారు. 

వడ్డీలేని రుణాలతో మహిళలను వ్యాపార వేత్తలుగా ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలిపారు. అనంతరం ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి, గాంధీభవన్‌లో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.

మహిళా రైతులకు పురస్కారాలు

సంగారెడ్డి: అంతరించిపోతున్న చిరుధాన్యాల పంటలను సాగు చేస్తున్న మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ వ్యవసాయ పురస్కారం అవార్డును ప్రదానం చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్ర మంలో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి మహిళా రైతులకుపురస్కారం ప్రదానం చేశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో ఉన్న డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) మహి ళా రైతు జడల చంద్రమ్మకు అవార్డు అందజేశారు. చిరుధాన్యాలు సాగు చేస్తున్న మెంటల్‌కుంటకు చెందిన సూర్యకళ, అర్జున్‌నాయక్‌తండాకు చెందిన  చాందిబాయి, నర్సమ్మ, టీ మంజులఈ కార్యక్రమంలో పాల్గొని, చిరుధాన్యాల సాగుపై వివరించారు. కొర్ర, సజ్జ, రాగులు, సామ, జొన్నతో పాటు పలు రకాల పంటలను రైతులు వర్షధారంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.