calender_icon.png 23 October, 2024 | 2:58 PM

చైనాతో పోటీ పడదాం

07-08-2024 01:53:15 AM

ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా

తెలంగాణ అంటేనే పెట్టుబడుల గమ్యస్థానం

సరళంగా కొత్త పారిశ్రామిక విధానం

రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రకటించారు.

అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలం గాణ అంటేనే వ్యాపారం, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం వివరించారు.

త్వరలోనే హైదరాబాద్‌లో నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది భారతదేశపు భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడుతుందన్నారు.

ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌తోపాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితోపాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామని సీఎం ప్రకటించారు. అటువంటి సరికొత్త ఆలోచనలతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. 

వీలైనన్ని పెట్టుబడులే తీసుకెళ్లడమే లక్ష్యం 

న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం వర్కింగ్ లంచ్ అనంతరం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు వివిధ రంగాలకు చెంది న పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశమయ్యారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్‌పర్సన్లు, సీఈవోలు ఈ సమా వేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చి ప్రసంగించారు. తన మనసులోని మాటలతోపాటు తమ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో, తన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేమిటో వెల్లడిస్తామంటూ అందరినీ ఉత్సాహపరిచారు.

సీఎం హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని, ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణకు ఉన్న అనుకూలతల న్నింటినీ సీఎం ఈ సందర్భంగా వివరించారు.

ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో బలమైన పునాదులు వేసుకుందని చెప్పారు. కొవిడ్‌ను అధిగమించేందుకు మిలియన్ల కొద్ది వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి సాయం చేసిందన్నారు. 

అమెరికాకు సమకాలీనం తెలంగాణ 

తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ప్రతిభ సంపద సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వ మద్దతు అందిస్తుందని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 ఏళ్ల పురాతమైన హైదరాబాద్ ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనంగా ఉందన్నారు.

అభిరుచితోపాటు అద్భుతమైన దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించా లని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఉన్న అనుకూలతలతోపాటు, అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా గొప్ప భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. 

టాప్‌టెన్ సిటీల్లో హైదరాబాద్ 

తెలంగాణను చైనాకు ప్రత్నామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనే సీఎం దార్శనీకతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికను విశ్లేషించారు.

ఈ సమావేశం తెలంగాణలో కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్లీరెన్, కేకేఆర్ పార్టనర్ దినేశ్ పలివాల్, సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్, న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూసన్, సేఫ్‌సీ గ్రూప్ చైర్మన్ ఎస్వీ అంచన్, టిల్మాన్ హెల్డింగ్స్ చైర్మన్ సంజీవ్ అహుజా, అమ్నీల్ ఫార్మా కో ఈసీవో చింటూ పటేల్, జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా, ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్) సుబ్బారావు, యాక్సెంచర్ ఎండీ అమిత్‌కుమార్, డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్, హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి, బీఎన్వై మెల్లన్ ఎండీ అట్లూరి, పేస్ యూనివర్సిటీ డీన్ జోనాథన్ హిల్, అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యా య, ఎస్‌అండ్‌పీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్ల కోట, ఇంటర్ కాంటినెంటల్ ఎక్సేంజ్ ఎండీ అశ్విని పన్సే పాల్గొన్నారు.