calender_icon.png 15 October, 2024 | 3:56 PM

బీసీ కుల గణన చేసి తీరతాం

15-10-2024 03:10:00 AM

  1. నా రాజకీయ ప్రస్థానంపై ‘హనుమంతుడు అందరివాడే’ పుస్తకం
  2. 26న మాజీ స్పీకర్ మీరాకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ
  3. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కుల గణన చేసి తీరుతామని పార్టీ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సాక్షాత్తు ప్రధాని మోదీ బీసీ అయి ఉండి కూడా పదేళ్ల నుంచి ఆయన బీసీల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టి ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పార్టీ అధిష్ఠానం కర్ణాటకలోనూ కుల గణన చేపట్టేలా చర్యలు తీసుకుంటుందన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై ఈ నెల 26న పుస్తకం వెలువడుతున్నదన్నారు.

ఢిల్లీలో మాజీ స్పీకర్ మీరాకుమార్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారన్నారు. పార్టీలో తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై తాను స్వయంగా ‘హనుమంతుడు అందరివాడే’ పేరుతో స్వీయ చరిత్ర రాశానని స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. యూత్ కాంగ్రెస్ నేత నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగానని గుర్తుచేసుకున్నారు. తన అనుభవాలను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో పుస్తకం రాశానని స్పష్టం చేశారు.