08-02-2025 01:47:28 AM
* చిరుత పాదముద్రల గుర్తింపు
* భయాందోళనలో ప్రజలు
ఖమ్మం, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట, పులిగుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి, చిరుత కూనతో సంచరిస్తున్నట్టు తెలుస్తున్నది. పులిగుండాల ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
అటవీ ప్రాంతంలోని మామిడి తోట కాపలాదారుడు చిరుత పాదముద్రలు గుర్తించి, అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖాధికారులు, రెవెన్యూ అధికారులు వెళ్లి గమనించి నిర్ధారించారు. కొంతకాలం వరకు పర్యాటకులకు పులిగుండాల ప్రాజెక్టులోకి అనుమతిని నిరాకరించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. చిరుత సంచారం వార్తతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు రక్షణ చర్యలు తీసుకుని, చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.