బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల చర్లపల్లి గ్రామ సరిహద్దుల్లో చిరుత పులి సంచరిస్తుంది. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలు కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా రంగపేట, ఎల్లారం, చర్లపల్లి అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచారం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. తాజాగా మంగళవారం చర్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలు కనిపించడంతో ఎఫ్ఆర్వో పూర్ణ చందర్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది చిరుత పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో సమీప అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.