calender_icon.png 2 October, 2024 | 5:50 AM

ఉదయ్‌పూర్‌లో హడలెత్తిస్తున్న చిరుత

01-10-2024 12:28:25 AM

11 రోజుల్లో ఏడుగురు మృతి

ఉదయ్‌పూర్, సెప్టెంబర్ 30: రాజస్థాన్‌లో ఓ చిరుత స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉదయ్‌పూర్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇటీవల ఆలయ పూజారిపై దాడి చేసిన చిరుత అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లిందని స్థానికులు చెప్పగా, సోమవారం ఉదయం అటవీ ప్రాంతంలో పూజారి డెడ్‌బాడీని గుర్తించారు.

ఇలా గడిచిన 11 రోజుల్లోనే చిరుతదాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయ్యారు. చిరుత దాడులు అధికమవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని అధికారులు చెబుతున్నా.. దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో స్థానికులు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ  ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రమైతే ప్రజలెవరూ ఆరుబయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమయాల్లో బయటకు రావాల్సి వస్తే గుంపులుగా రావాలని సూచించారు.

ఆ టైమ్‌లో కర్రలు లేదా ఇతర ఆయుధాలను వెంట తీసుకెళ్లాలని గ్రామస్తులను అధికారులు కోరారు.  ఈ దాడులన్నింటినీ ఒకే చిరుత చేస్తున్నట్లు ఓ అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఘటనల్లోనూ జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకేలా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు వెల్లడించారు.