calender_icon.png 1 February, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల అటవీ ప్రాంతంలో అడవి పందిపై పెద్దపులి దాడి..!

01-02-2025 06:05:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పత్తి చేనులో శనివారం అడవి పందిపై పెద్దపులి దాడి చేసింది. గురువారం సాయంత్రం నుండి కన్నాల, బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది. కన్నాల గ్రామానికి సమీపంలోనే నీళ్ల కుంటలో నీళ్లు తాగుతూ అటవీ అధికారులకు కనిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం కన్నాల, బుగ్గ అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి అదేరోజు మధ్యాహ్నం కుంట రాముల బస్తి నీలగిరి ఫారెస్ట్ లో నుండి పెద్దనపల్లి మామిడి తోటల్లోకి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని బెల్లంపల్లి రేంజ్ అటవీ అధికారులు కూడా స్పష్టంగా వెల్లడించారు. బెల్లంపల్లిలోని కన్నాల అడవుల నుండి పెద్దపులి వెళ్లిపోయినట్లు అంతా భావిస్తున్న తరుణంలో తిరిగి శనివారం అదే ప్రాంతంలోని తోకల తిరుపతి అనే వ్యక్తికి చెందిన పత్తి చేనులో పెద్దపులి అడవి పందిపై దాడి చేయడం సర్వత్ర ఆందోళన రేపుతోంది. కన్నాల అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి బీ-2, అయి ఉంటుందని, ఇది తిర్యాణి అడవుల నుండి వచ్చినట్లు తమకు సమాచారం ఉందని అటవీ అధికారులు వెల్లడించారు.

అయితే ఈ పులి అడవులను దాటి వెళ్లిపోయిందని అనుకుంటుండగా మరుసటి రోజే కన్నాల అటవీ ప్రాంతంలోని పత్తి చేనులో అడవి పందిని తింటూ సంచరిస్తుండడం అనుమానాలను రేకెత్తిస్తుంది. కన్నాల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులకు కనిపించిన పెద్దపులి, పెద్దనపల్లి మామిడి తోటల్లో సంచరిస్తున్న పెద్దపులి ఒకటి కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా బెల్లంపల్లి బుగ్గ పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్దపులి మూడు రోజులుగా సంచరిస్తూ హడలెత్తిస్తుండడంతో బుగ్గ గూడెం, కరిశెలఘట్టం, అంకుశం, కన్నాల, లక్ష్మీపురం, కుంట రాములు బస్తి ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కుంట రాములు బస్తీలో గల శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం శనివారం విద్యార్థులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించింది.