22-04-2025 07:20:53 PM
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సిపిఐ కార్యాలయంలో రష్యా విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ మండల కార్యదర్శి అంతినేని సురేష్ హాజరై చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశాన్ని తమ ప్రత్యక్ష వలసగా మార్చుకుని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆర్థిక, రాజకీయ దోపిడీ, అణిచివేతలకు పాల్పడినప్పుడు భారత జాతీయ నాయకులు సోవియట్ విప్లవం వైపు చూశారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు లెనిన్ పై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ బాలగంగాధర తిలక్ తన 'కేసరి' పత్రికలో 1918 జనవరి లోనే "రష్యా నాయకుడు లెనిన్!" అనే సంపాదకీయంలో లెనిన్ ను శాంతికాముకునిగా కీర్తించాడనీ గుర్తు చేశారు.
"అగ్ర రాజ్యాలు తమ స్వార్ధ ప్రయోజనాలకై యుద్ధాలను రెచ్చగొడుతూ ఉంటే లెనిన్ వాటిని వ్యతిరేకించాడని" అభినందించాడు. అంతేకాక "పేద రైతాంగానికి భూమిని పంచిపెట్టటానికి సంకల్పించడం, పేదలను ఉద్ధరించే గొప్ప విప్లవాత్మక చర్యగా" తిలక్ పేర్కొన్నాడన్నారు. లాలాజపతిరాయ్, గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు తమ తమ పద్ధతులలో లెనిన్ ను శ్లాఘించారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి అక్కనపల్లి నాగేంద్రబాబు, సిపిఐ మండల నాయకులు నారాయణ, రామ్మూర్తి, రఘు, రాము, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.