calender_icon.png 18 January, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎస్పీకి చట్టబద్ధత!

19-12-2024 12:00:00 AM

వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు  ఊహించని రీతిలో భారీ నైతిక మద్దతు లభించింది. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా సాగు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని వ్యవసా య, పశు సంవర్ధక, ఆహార ప్రాసెసింగ్ రంగాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటు స్థాయీసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ  చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని కమిటీ మంగళవారం తన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. కనీస మద్దతుధరలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో ఢిల్లీ చలో యాత్రకు రైతులు మరోసారి సిద్ధమయిన తరుణంలో స్థాయీ సంఘం చేసిన సిఫార్సులు వారికి నైతిక మద్దతు ఇచ్చినట్లయింది. తమ ఆందోళనలో భాగంగా రైతులు గత కొంత కాలంగా పంజాబ్‌హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖానౌరీ చెక్‌పోస్టుల వద్ద తిష్టవేసి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించడం ద్వారా రైతులు ఆత్మహత్యలను నివారించడంతో పాటుగా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంటుందని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. అప్పుల బారినుంచి రైతులను కాపాడేందుకు ఇదే కీలక బ్రహ్మస్త్రమని తేల్చి చెప్పింది. అదే సమయంలో రైతులు, రైతు కూలీల రుణాలను మాఫీ చేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకు రావాలని సూచించింది. పీఎం కిసాన్ నిధులను ఇప్పుడున్న రూ.6 వేలనుంచి రూ.12 వేలకు పెంచాలని, వ్యవసాయ కూలీల కనీస వేతన నిర్ధారణకు జాతీయ కమిషన్‌ను నియమించాలని కూడా స్థాయీసంఘం సిఫార్సు చేసింది.

వీటితో పాటుగా పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడడానికి రైతులకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వా లనికూడా సూచించింది. రైతుల ప్రధాన డిమాండ్లు కూడా ఇవే.  కేంద్రప్రభుత్వం ప్రస్తుతం 23 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తోంది. అయితే వీటికి చట్టబద్ధత లేని కారణంగా వ్యాపారులు, మధ్య దళారులు రైతులనుంచి తక్కువ ధరకే కొనుగోళ్లు చేస్తున్నారు.

2021లో  దాదాపు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతుల ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నది ఒకటి. రైతుల ఆందోళనకు దిగివచ్చిన కేంద్రం అంతకు ముందు తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరలపై ఒక కమిటీని కూడా వేసిం ది. ఆ కమిటీ ఏం సిఫార్సు చేసిందో తెలియదు కానీ ఆందోళన సమయం లో రైతులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు కాలేదు. దీంతో రైతు లు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు.

తమ ఆందోళనలో భాగంగా ఢిల్లీకి పాదయాత్రగా బయలు దేరిన పంజాబ్ రైతులను శంభు సరిహద్దు ల్లో హర్యానా పోలీసులు అడ్డుకోవడంతో పాటుగా వారిపై భాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులను ప్రయోగించారు. దీంతో తాత్కాలికంగా యాత్రను విరమించిన రైతులు సరిహద్దుల్లోనే ఉంటూ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు 70 ఏళ్ల రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ ధరీవాల్ 20 రోజులుగా పంజాబ్‌హర్యానా సరిహద్దుల్లో ఆమరణ దీక్ష కూడా చేస్తున్నారు.

బుధవారం ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రాగా, ఆయనకు తగిన వైద్య సహాయం అందేలా చూడాలని న్యాయస్థానం పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. అంతేకాదు ఉన్నత స్థాయి కమిటీ ముందు ప్రతిపాదనలు చేసే బదులు రైతులు నేరుగా తమ డిమాండ్లను కోర్టు ముందుంచవచ్చని కూడా న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు స్థాయీసంఘం చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తుందో లేదో చూడాలి.