calender_icon.png 6 October, 2024 | 6:01 AM

హైడ్రాకు చట్టబద్ధత

06-10-2024 02:31:45 AM

హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాష్ర్ట రాజధానిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్‌పై ఆయన సంతకం చేశారు.

జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరిస్తూ గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలో కొత్తగా 374 (బి) సెక్షన్‌ను చేర్చినట్లు గెజిట్‌లో పేర్కొంది. ఆ సెక్షన్ ద్వారా హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది.

హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ విపక్షాల నేతలు విమర్శలు చేస్తుండడం, హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడం విశేషం. పలు కూల్చివేతలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జరిగిన విచారణల్లో వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్‌కు, రాష్ర్ట ప్రభుత్వానికి ఇప్పటికే పలు నోటీసులు జారీఅయ్యాయి.

తదుపరి విచారణ ఈ నెల 14న జరగనున్నందున ఆర్డినెన్సు విషయమై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వివరించే అవకాశమున్నది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడంతో గెజిట్ విడుదలైన తేదీ నుంచే హైడ్రా ఉనికిలోకి వస్తుంది. 

జులై 19న హైడ్రా ఏర్పాటు

జులై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ని విడుదల చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ని ఓఆర్‌ఆర్ వరకు హైడ్రా పరిధిలోకి తీసుకొస్తూ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

ఈ క్రమంలో హైడ్రా చట్టబద్దతపై న్యాయస్థానాలు కూడా ప్రశ్నించడంతో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఆర్డినెన్స్‌కు అనుగుణంగా జీవో 99లోనూ మార్పులు జరుగనున్నాయి. దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు సమకూరనున్నాయి.