* ఉత్తమ లెజిస్లేచర్ అవార్డును పరిశీలిస్తాం
* స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
‘ప్రజాస్వామ్యంలో చట్టసభలది క్రియాశీల పాత్ర. ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుంది. చట్టాల రూపకల్పనతోపాటు వాటి అమలు తీరు, ప్రజల కు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంటుం ది ’ అని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని స్పీకర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజలు గమనిస్తూ వాటిపై చర్చించుకుంటారన్న విషయాన్ని సభ్యులు గుర్తుంచుకో వాలన్నారు.
శాసనసభ వ్యవహారాలపై సభ్యులకు పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడే సభలో అర్థవంతంగా మాట్లాడతారని అన్నారు. గతంలో సీనియర్లు సభలో మాట్లాడుతున్నప్పుడు నూతన సభ్యులకు స్ఫూర్తిగా ఉండేదన్నారు. శాసనసభ, శాసనమండలిలో రోశయ్య, రజీబ్ అలీ, బోడేపూడి వెంకటేశ్వరరావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, ఓంకార్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నర్రా రాఘవరెడ్డి వంటి వారు గొప్ప వక్తలుగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ఢిల్లీకి చెందిన పీఆర్‌ఎస్ ఇన్సిట్యూట్ వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఓరియంటెడ్ ప్రోగ్రాంలు నిర్వహించిందని, ఈ సదస్సును సభ్యులు వినియోగించుకోవాలని సూచించారు. గతంలో మాదిరి కాకుండా ప్రభుత్వం కోరిన విధంగా ఎక్కువ రోజులు సభా సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తరహాలో ఉత్తమ లేజిస్లేచర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని స్పీకర్ తెలిపారు.