calender_icon.png 5 February, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి..

05-02-2025 07:44:01 PM

బీసీల అభివృద్ధికి ముందడుగు పడటం అభినందనీయం..

సింగిల్ విండో ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలి..

సీఎం రేవంత్ రెడ్డికి రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో పాటు మర్యాదపూర్వకంగా కలిసి బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. అనంతరం రాచాల మీడియాతో మాట్లాడుతూ.. బీసీలందరికీ సమాజంలో సముచితమైన గౌరవం, స్థానం కల్పించాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీల అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన చేపట్టాలని దేశంలోని బీసీలు గల్లి నుండి ఢిల్లీ దాకా పోరాటం చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

బీసీ ప్రధాని అని గొప్పగా చెప్పుకునే బిజెపి కూడా సమగ్ర కులగణన చేస్తామని హామీ ఇచ్చి మూడు సార్లు అదికారంలోకి వచ్చింది కానీ కుల గణన చేపట్టలేదని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయని దుస్థితిలో బిజెపి ఉందన్నారు. గొంతు చించుకుని అరుస్తున్న బీఆర్ఎస్ నాయకులు 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తోందని, ఆ లెక్కలు వెల్లడించకుండా బీసీలను రాజకీయంగా అణచివేశారని కేసిఆర్ పై మండిపడ్డారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసి, బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉంటూ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ లకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 

కానీ రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టడమే గాక వెల్లడించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ఇప్పటివరకు సింగిల్ విండో ఎన్నికల్లో డైరెక్టర్లకు రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వాలు సొసైటీ అధ్యక్షులకు, డీసీసీబీ చైర్మన్లకు మాత్రం కల్పించలేదని, రాబోయే సింగిల్ విండో ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని పాలమూరు బిడ్డ ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలవడమే గాక దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారని రేవంత్ ను కొనియాడారు.