calender_icon.png 13 January, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు దిగుతున్నరు..

07-12-2024 12:21:24 AM

  1. బీఆర్‌ఎస్‌ను వీడి హస్తం పార్టీలో చేరికలు
  2. ఇతర పార్టీల వైపు ద్వితీయశ్రేణి నాయకులు..
  3. సూర్యాపేటలో తగ్గుతున్న కారు హవా!
  4. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆందోళనలో కార్యకర్తలు

సూర్యాపేట, డిసెంబర్ 6 (విజయక్రాంతి): గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బీఆర్‌ఎస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో క్రమంగా తన ప్రాభావాన్ని కోల్పోతోందనే భావన కలుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో సహితం ఘోర పరాభావాన్ని చవిచూసింది.

అప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మరి కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, తృతీయశ్రేణి నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. దీంతో క్షేత్రస్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు మాత్రమే మిగిలారు. ఇప్పుడు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామ, మండల స్థాయిలో పార్టీని నడిపే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

నాడు.. నేడు

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు నల్లగొండ జిల్లాలో భాగమైన సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితులు మారాయి. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లోనే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరింది. కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచింది. 2018లో హుజుర్‌నగర్ మినహా మూడు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది.

హుజుర్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హుజుర్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగగా బీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి విజయం సాధించారు. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పాగా వేసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి  నాయకులు బీఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు.

అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల్లోనూ 98 శాతం బీఆర్‌ఎస్ నేతలే గెలుపొందారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మినహా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమిపాలైనారు. అప్పటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, కిందిస్థాయి నాయుకులు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 

నియోజకవర్గాల్లో పెరిగిన వలసలు

సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజుర్‌నగర్‌కు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి, గ్రామస్థాయి బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. హుజుర్‌నగర్ మున్సిపల్ చైర్మన్‌తోపాటు కొంత మంది కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరారు. కోదాడ, తిరుమలగిరి, నేరెడుచర్ల మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవిపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. సూర్యాపేట మున్సిపాలిటీలో కొంతమంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఇక్కడ మార్పు జరుగలేదు. ఇక మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో 70 శాతం మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

ప్రజల్లో లేని నాయకులు 

సూర్యాపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తన గ్రాప్ పడిపోకుండా ఉండేందుకు ప్రజల్లో ఉంటున్నారు. హుజుర్‌నగర్ నియోకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన శానంపుడి సైదిరెడ్డి పార్లమెం ట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో అక్కడ పార్టీని నడిపే నాయకుడే కరువయ్యారు. తుంగతుర్తిలో రెండుసార్లు గెలుపొంది, ఇటీ వల ఎన్నికల్లో ఓటమిపాలైన గాదరి కిషోర్, కోదాడ మాజీ ఎమ్మెల్యే  బొల్లం మల్లయ్యయాదవ్ అడపాదడపా నియోజకవర్గాలకు వస్తున్నా కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు.