calender_icon.png 25 October, 2024 | 5:54 AM

28లోగా తప్పుకోండి

25-10-2024 03:02:11 AM

జస్టిన్ ట్రూడోకు 

సొంతపార్టీ నేతల అల్టిమేటం

లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కెనడా ప్రభుత్వం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28 నాటికి ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ జస్టిన్ ట్రూడోకు లిబెరల్ పార్టీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. విధించిన గడువు నాటికి రాజీనామా చేయకుంటే తిరుగుబాటును ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వచ్చే ఏడాది అక్టోబర్ జరగబోయే జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో కెనడా ప్రధాని సొంత పార్టీకి చెందిన చట్టసభ సభ్యులతో బుధవారం సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా దాదాపు 20 మంది చట్టసభ సభ్యులు ట్రూడో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.154 మంది చట్టసభ సభ్యుల్లో 24 మంది సభ్యులు వచ్చే ఎలక్షన్స్‌లో జస్టిన్ ట్రూడో ప్రధాని పోటీ నుంచి తప్పుకోవాలని కోరుతూ లేఖపై సంతకాలు చేశారు. గత 100 సంవత్సరాల చరిత్రను చూస్తే ఏ కెనడా నాయకుడు కూడా నాలుగోసారి ఎన్నికల్లో విజయం సాధించలేదని తెలిపారు. ఖలిస్తానీ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో సొంతపార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా ట్రూడో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. సీబీసీ పోల్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. సీబీసీ నిర్వహించిన పోల్‌లో రిబెరల్ పార్టీ కంటే కన్సర్వేటివ్ పార్టీ 20 పాయింట్లతో లీడ్‌లో ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో లిబెరల్ పార్టీకి ఓటమి తప్పదని సీబీసీ అభిప్రాయపడింది.