- ఇందూరు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో అక్రమాలు
- విద్యాశాఖ డైరెక్టరేట్ లిస్టుకు మార్పులు చేర్పులు
- భారీగా దండుకున్న డీఈవో దుర్గాప్రసాద్
- 2000 డీఎస్సీ వారిని కాదని 2002 టీచర్లకు పదోన్నతి
- 74 మందికి బదులు 80 మందికి ప్రమోషన్లు
- చర్యలకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
నిజామాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లలో నిజామాబాద్ జిల్లాలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డైరెక్టరేట్ కార్యాలయం నుంచి పంపించిన పదోన్నతుల జాబితాను కామ్ స్కాన్ అనే యాప్ ద్వారా ఎడిట్ చేసి జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, డీఈవో కార్యాలయ సిబ్బంది అక్రమా లకు తెగబడ్డారని మండిపడ్డారు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిం దని, వీరికి అలాటైన పాఠశాలలను జూనియర్లకు కేటాయించారని , ఈ స్కామ్‌లో రూ. లక్షలు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తే.. డీఈవో ఆఫీసుకు పిలిపించుకుని అనధికారిక వ్యక్తులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఓదార్చే పనిలో పడ్డారు. తమకు కేటాయించిన పాఠశాలల్లో కొందరు స్కూల్ అసిస్టెంట్లు చేరినా, మరికొందరు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. కేటాయించిన పాఠశాలల్లోనే రిపోర్టింగ్ చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు బెదిరించడం కొసమెరుపు.
సీనియర్ల అవకాశాలకు గండి
విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి వచ్చిన సీనియారిటీ లిస్ట్‌ను కామ్‌స్కానర్ యాప్ ద్వార మార్పిడి చేసిన అధికారులు.. జూనియర్ల వద్ద రూ.లక్షల్లో దండుకుని.. సీనియర్ల అవకాశాలకు గండికొట్టారు. ౨౦౦౦ డీఎస్సీ ఉపాధ్యాయులను కాదని ౨౦౦౨ డీఎస్సీ టీచర్లకు పదోన్నతులు ఇవ్వడం జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లాలో 80 మందికి ప్రమోషన్లు ఇస్తే, 18వ స్థానంలో ఉన్న ఉపాధ్యాయిడు తాను కోరుకున్న చోట ప్రమో షన్ రాక ఇబ్బందులు పడ్డారు. లోకల్ బాడీస్ పాఠాశాలలో తెలుగు మీడియంలో 18వ రోస్టర్ పాయింట్‌లో ఉన్న వీ హరిజీవన్ అనే ఉపాధ్యాయునికి, లిస్టును మార్చ డం ద్వారా తాను కోరుకోని లెప్ట్ ఓవర్ వేకేన్సీ అలాటై, ఏర్గట్ల పాఠశాలలో జాయిన్ కావల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అన్యాయంపై బాధితుడు విద్యాశాఖ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయడంతో.. జక్రాన్‌పల్లి మండలంలోని గాంధీనగర్ యూపీఎస్ కేటాయిం చారు. తీరా పాఠశాలలో చేరగా, అక్కడ ఆరు, ఏడో తరగతి విద్యార్థులే లేరని, పాఠశాలను బ్లాక్‌లో ఉంచినట్టు తెలిసింది. ఇలా బ్లాక్ అయిన పాఠశాలలను ఓపెన్ చేయడానికి ఒక్క విద్యాశాఖ డైరెక్టర్‌కే అనుమతి ఉంది. కానీ, నిజామాబాద్ జిల్లాలో మాత్రం డీఈవోనే పోస్టులు కేటాయిస్తున్నారు. మరోవైపు పదోన్నతిపై ఏర్గట్ల జెడ్పీహెచ్‌ఎస్‌కు వచ్చిన మరో ఉపాధ్యాయుడు సైతం విధుల్లో చేరకపోవడంతో 275 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు లేని పరిస్థితి తలెత్తింది.
౩౨వ రోస్టర్ పాయింట్లతో ఉన్న పీ మురళి అనే గణిత ఉపాధ్యాయునికి పల్లికొండ జడ్పీహెచ్‌ఎస్‌ను కేటాయించాల్సి ఉండగా, 34 రోస్టర్ పాయింట్లు ఉన్న మరో ఉపాధ్యాయునికి కేటాయించారు. తనకు జరిగిన అన్యాయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయపోరాటానికి దిగగా అతనికి భీంగల్ జెడ్పీ పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ పాఠశాల సైతం బ్లాక్ లిస్టులో ఉండటం గమనార్హం.
డీఈవోపై చర్యలు తీసుకోవాలి
డీఈవో వ్యవహారంపై విద్యాశాఖ డైరెక్టరేట్ విచారణ జరిపించాలి. డీఈవో అక్రమాలపై డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు ఐదు పేజీల లేఖను అందజేశాం. పదోన్నతుల విషయంలో నిబంధనలను తుంగలో తొక్కిన డీఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
శంతన్, డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు